గొర్రెలకు కూడా తెలివితేటలు ఉన్నాయట

18 Nov, 2017 14:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలివితేటలులేని వారిని, మంద బుద్ధిగల వారిని మనం సాధారణంగా గొర్రెలని విమర్శిస్తుంటాం. కానీ తెలివితేటలు గొర్రెలకు కూడా ఉంటాయట అవి మనుషులను గుర్తుపట్టగలవట. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడూ చూడని సెలబ్రిటీలను మరింత చక్కగా గుర్తుపట్టగలవట. అదెలాగంటే ఫొటోలను చూడడం ద్వారట. మనుషులవి, సెలబ్రిటీల ఫొటోలను చూపించడం ద్వారా కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు గొర్రెల తెలివితేటలపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిరూపించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, సినీతారలు ఎమ్మా వాట్సన్, జేక్ గెల్లెన్హాల్, బ్రిటన్ న్యూస్ రీడర్ పిలోనా బ్రూస్ ఫొటోలను ఉపయోగించి యూనివర్శిటీ పరిశోధకులు  ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మరింత మెరుగ్గా జంతుసంరక్షణ చేయడం కోసం ఇలాంటి అధ్యయనాలు ఉపయోగపడడమే కాకుండా మనుషులకు వచ్చే హంటింగ్డాన్, పార్కిన్సన్స్ రోగాలతోపాటు స్కిజోఫ్రేనియా, ఆటిజమ్ లాంటి మానసిక రుగ్మలతలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.

మనుషులకు, గొర్రెలకున్న తేడాలను గుర్తుపడతాయా అన్న అంశానికి సంబంధించి 2001లోనే గొర్రెలపై పరిశోధనలు జరిగాయని, మనుషుల ఫొటోల నుంచి గొర్రెలను వేరుచేసి అవి గుర్తుపట్టడమే కాకుండా ఫొటోలో వ్యక్తమవుతున్న ఉద్విగ్న భావాలకు కూడా అవి స్పందిస్తాయని అప్పుడు పరిశోధకులు గుర్తించారన్నారు. అవి కేవలం ఫొటోలను మాత్రమే గుర్తించుకుంటాయా లేదా నిజంగా మనుషులను గుర్తిస్తాయా ? అన్న అంశాన్ని మరింత లోతుగా తెలుసుకోవడం కోసం తాజా అధ్యయనం జరిపినట్లు వారు చెప్పారు.

అంతకుముందు చూపిన ఫొటోలు, ఎప్పుడు వాటికి చూపని ఫొటోలను వేలాడదీసి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫొటోల కింద వాటికి కొద్దిగా ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గొర్రెలు తెల్సిన ఫొటోలవైపే వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన గ్రాసాన్ని తిన్నాయి. ఎన్నిసార్లు పంపించినా తెలియని ఫొటోలవైపు అవి వెళ్లలేదు. మొదట నేరుగా చూపించిన ఫొటోలను రెండోసారి చూపించినప్పుడు అవి 80 శాతం టైమ్లోనే గుర్తించాయని, అదే వేర్వేరు భంగిమల్లో తీసిన ఫొటోలను చూపించినప్పుడు వాటిని గుర్తించడానికి మొదటిసారి ఎక్కువ సమయం తీసుకోగా, రెండోసారి అందులో 90 శాతం సమయాన్ని తీసుకున్నాయని పరిశోధకులు వివరించారు. మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడంలో గొర్రెలపై తాము నిర్వహించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.
 

 

మరిన్ని వార్తలు