షెరిన్‌ మాథ్యూస్‌ కేసులో పెంపుడు తండ్రికి జీవిత ఖైదు

27 Jun, 2019 08:54 IST|Sakshi

వాషింగ్టన్‌ : రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడేళ్ల భారతీయ బాలిక షెరిన్‌ మాథ్యూస్‌ మృతి కేసులో అరెస్టయిన ఆమె దత్తత తండ్రి వెస్లీ మాథ్యూస్‌కి డల్లాస్‌ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 30 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాతే అతను పెరోల్‌కు అర్హుడని తేల్చి చెప్పింది. ఓ మూడేళ్ల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతని మిగతా జీవితం అంతా జైలులోనే గడపాలని కోర్టు ఆదేశించింది.

కేరళకు చెందిన సైనీ, వెస్లీ దంపతులు 2016లో బిహారులోని ఓ శరణాలయం నుంచి  ప్రత్యేక అవసరాలున్న షెరిన్‌ను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకెళ్లారు. 2017 అక్టోబరు 7న షెరిన్‌ కనపించకుండా పోయిందంటూ వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా పాలు తాగనందుకు షెరిన్‌పై ఆగ్రహించిన వెస్లీ పాపను తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో షెరిన్‌ని ఒంటరిగా ఇంటి బయట నిలబెట్టనాన్నడు. తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదని వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఇంటి నుంచి పంపించిన 15 నిమిషాలకే తాను వెళ్లి చూశానని.. అప్పటికే పాప అక్కడ లేదని వెస్లీ చెప్పాడు. అయితే అఫిడవిట్‌లో మాత్రం తాను సూర్యోదయం అయ్యాక వెళ్లి చూశానని పేర్కొన్నాడు వెస్లీ.

కొన్నిరోజుల  తార్వత వెస్లీ ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఆ మృతదేహం చిన్నారి షెరిన్‌దేనని తేలింది. దీంతో వెస్లీని విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఘటన జరిగిన రోజు షెరిన్‌ పాలు తాగనని మారాం చేసిందని.. దాంతో తాను బలవంతంగా ఆమెతో పాలు తాగించానని వెస్లీ చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు వూపిరాడలేదని తెలిపాడు. కొద్ది సేపటికే ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోయిందని.. పల్స్‌ కూడా కొట్టుకోలేదని, దీంతో ఆమె చనిపోయినట్లు అర్థమైందని చెప్పాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తానే ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లి గుర్తు పట్టరాకుండా చేసి కల్వర్టులో పడేశానని అంగీకరించాడు.

మరిన్ని వార్తలు