పసిఫిక్‌లో అదృశ్యం.. హిందూలో ప్రత్యక్షం

3 Sep, 2018 13:08 IST|Sakshi

థోంగ్వా(మయన్మార్‌): కొన్ని సంఘటనల వెనుక మర్మమేమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. వాటికి సమాధానం తెలుసుకోవాలన్నా దొరకదు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం పసిఫిక్‌ మహాసముద్రంలో అదృశ్యమైన ఓ భారీ నౌక.. గతవారం హిందూ మహాసముద్రంలో కన్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘దెయ్యం ఓడ’గా పిలుచుకుంటున్న సామ్‌ రత్లుంగి పీబీ 1600 అనే నౌక వేల టన్నుల సరుకులతో ఇండోనేషియా జెండాతో బయలుదేరింది. ఈ నౌక చివరిసారిగా 2009లో తైవాన్‌ సముద్ర జలాల్లో కనిపించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. పలు దేశాలకు చెందిన అధికారులు ఎంత గాలింపు చేపట్టిన షిప్‌ జాడ కనిపెట్టలేకపోయారు. 

ఎంత వెతికినా నౌక ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది పసిఫిక్‌ మహాసముద్రంలో ఎక్కడో మునిగిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా  ఇటీవల ఆగస్టు 30వ తేదీన ఆ నౌకను మయన్మార్‌ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ మత్స్యకారులు గుర్తించారు. అందులోకి వెళ్లి చూడగా అందులో ఎవరూ కనబడలేదు. అందులో ఎటువంటి సరకులు కూడా లేవు. దీంతో వారు తీరప్రాంత పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా దానిని పరిశీలించారు. అయిన కూడా ఆ నౌక ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోలేకపోయారు. 9 ఏళ్ల తరువాత నౌక వెలుగులోకి రావడంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ.. ఆ నౌక ఇంతకాలం ఎక్కడ ఉంది, అందులోని సరుకులు, సిబ్బంది ఎమయ్యారు అనే ప్రశ్నలు సమాధానాలు లేనివిగానే మిగిలాయి. కాగా, 177.35 మీటర్ల పొడవు, 27.91 మీటర్ల వెడల్పుతో 2001లో ఈ ఓడను నిర్మించారు. 

మరిన్ని వార్తలు