అంతరంగాన్ని తాకే ధ్వని తరంగం!

18 Oct, 2016 02:59 IST|Sakshi
అంతరంగాన్ని తాకే ధ్వని తరంగం!

శ్రీకృష్ణుడి బృందావనాన్ని అంధులు చూడవచ్చని అంటారు! అక్కడ మూగవారు మాట్లాడగలరనీ అంటారు. ఇది ఎంత వరకు నిజమో మనకు తెలియదుగానీ.. ఈ సైన్స్ ప్రపంచంలో మాత్రం వైకల్యమున్న వారికి దాదాపుగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలైతే కుప్పలు తెప్పలుగా జరుగుతున్నాయి. పక్కన ఫొటోలోని వారు తొడుక్కున్న షర్ట్ కూడా అలాంటిదే. వినికిడి శక్తి తక్కువ ఉన్నవారికీ, లేనివారికీ సంగీతపు మధురిమను అందిస్తుంది ఈ హైటెక్ షర్ట్. జర్మనీలోని క్యూట్ సర్క్యూట్ అనే టెక్నాలజీ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇదే సంస్థ రెండేళ్ల క్రితం అవసరానికి తగ్గట్టుగా డిజైన్‌ను మార్చగల, ట్వీట్లు చేయగల హైటెక్ షర్ట్‌ను తయారు చేసింది.

బధిరులకు ఉపయోగపడే షర్ట్‌పై కొన్ని కీలకమైన ప్రదేశాల్లో దాదాపు 16 యాక్చుయేటర్స్ ఏర్పాటు చేయడం, సంగీతానికి తగ్గట్టుగా అవి కొన్ని ప్రకంపనలు సృష్టించడం ఈ షర్ట్ ప్రత్యేకత. ఉదాహరణకు ఆర్కెస్ట్రా నడిచే స్టేజీపై పదుల సంఖ్యలో ఏర్పాటు చేసిన మైక్రోఫోన్లు అక్కడి శబ్దాలను గ్రహిస్తే... ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ వాటిని డిజిటల్ రూపంలోకి మారుస్తుంది. ఈ సమాచారం వైర్‌లెస్ పద్ధతిలో షర్ట్‌కు చేరుతుంది. డ్రమ్ముల శబ్దం తాలూకూ ప్రకంపనలు పొట్ట భాగంలోవస్తే... వయోలిన్‌వి చేతుల మీద వస్తాయన్నమాట. శబ్దం తాలూకూ తీవ్రతకు అనుగుణంగా ఉండే ఈ కంపనాలను బధిరులు ‘ఫీల్’ కావచ్చునని తద్వారా సంగీతాన్నీ ఆస్వాదించవచ్చునని అంటున్నారు ఈ షర్ట్‌ను అభివృద్ధి చేసిన ఆర్కెస్ట్రా సభ్యులు. ఇప్పటికే దీన్ని కొంతమంది బధిరులు వాడి ఆ అనుభూతిని పొందారు కూడా. జర్మనీలోని జంగ్‌జే సింఫోనికర్ ఆర్కెస్ట్రా వీటిని ఇప్పటికే మార్కెట్‌లో అమ్మకానికి పెట్టేసింది. ఇంతకీ దీని పేరేమిటో తెలుసా? సౌండ్ షర్ట్!

మరిన్ని వార్తలు