ప్రపంచాన్ని కదిలించిన చిత్రాలు

8 Sep, 2015 17:57 IST|Sakshi

 చిత్రం దృశ్యాన్ని బంధిస్తుంది.
 చిత్రం మాట్లాడుతుంది.
మాటలకందని భావాలను సైతం పలికిస్తుంది.
చివరికి కంటతడి కూడా పెట్టిస్తుంది.

తాజాగా టర్కీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన  అయలాన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరిని చలింపచేసింది. మనసున్న ప్రతి గుండెను కన్నీరు పెట్టించింది.  స్వార్థపు మత్తుతో గాఢనిద్రలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది. కేవలం ఫొటోలతో ప్రపంచాన్ని కదిలించి..చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన.. ఇలాంటి మరొకొన్ని  చిత్రాలను ఒక సారి పరికిస్తే...          
 
 అమెరికా-వియత్నాం యుద్ధం
 అమెరికా, వియత్నాం యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు తార్కాణమీచిత్రం.సైన్యం ప్రయోగించిన నాపాం బాంబు దాడిలో ఒళ్లంతా కాలిన గాయాలతో బట్టలు విప్పేసి నగ్నంగా నడిరోడ్డుపై ప్రాణభయంతో పరుగెడుతున్న వియత్నాం బాలిక ఫాన్ ది కిమ్ ఫుట్ ఫొటో ఇది.  ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో, దాని తీవ్రత ప్రజలపై, ముఖ్యంగా పసిపిల్లలపై చూపిన ఆనాటి భయానిక పరిస్థితులు..ఈ ఒక్క చిత్రంచూస్తే అర్థమవుతుంది.  అమెరికా యుద్ధోన్మోదానికి సజీవ ఉదాహరణ ఈ చిత్రం.  నిక్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోని తీశాడు. ఫొటో తీసిన తరువాత నిక్ ఆ పాప ఒంటిపై తన కోట్‌ను కప్పి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి..కిమ్ ప్రాణాలను కాపాడాడు.  ఒక విధంగా అమెరికా వియత్నాం యుద్ధాన్ని విరమించడానికి ఈ చిత్రం కూడా ఒక కారణమే. వియత్నాంపై అమెరికా చేస్తున్న యుద్ధానికి అమెరికన్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావటంతో  ఆ దేశం యుద్ధాన్ని విరమించింది. యుద్ధాల్లో పసిపిల్లలు ఎలా బాధితులవుతన్నారో ప్రపంచానికి  చెంపచెల్లుమనేలా చాటిచెప్పిన చిత్రమిది.
 
 కాటేసినకరవు ..
 ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుతో ఉన్న చిన్నారి.. పక్కనే  చనిపోతే తినడానే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న రాబందు. ఈ ఫొటోను చూస్తే చలించని వారు ఉండరు. సుడాన్‌లో ఆ నాటి కరువు పరిస్థితులు, పోషకాహారలోపానికి శిశువులు ఎలా బలయ్యారనే దానికి ఈ ఫోటో ప్రత్యక్ష ఉదాహరణ. కెవిన్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ 1993లో ఈ  ఫొటోను తీశారు. ఈ ఫొటో తీసి కార్టర్ తనమానాన తాను వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడిని రక్షించే పని చేయలేదు.  ఆ తరువాత ఆ రాబందు పసివాడిని తినేసిందో? లేక వదిలేసిందో? ఆ దేవుడికి తెలియాలి. ఈ ఫొటో తీసినందుకు కార్టర్‌కు పులిట్జర్ బహుమతి లభించింది. కానీ ఆ చిన్నారిని కాపాడనందుకు.. ఆ సమయంలో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాబందును నుంచి ఆ చిన్నారిని రక్షించకుండా అలాగే వదిలేసి వచ్చానన్న బాధతో.. కొన్ని నెలల తరువాత కెవిన్ కార్టర్ ఆత్మచేసుకుని చనిపోయాడు.
 
 సాహసమేరా జీవితం..
 ఒక వ్యక్తి ఎంతో ధైర్యంగా యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి ఉన్న చిత్రం ఇది. చైనాలో రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు పిలుపునిస్తూ 1989 లో సుమారు 10 లక్షల మంది ప్రజలు బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్ వద్ద కొన్ని వారాలపాటు నిరసన చేపట్టారు. అయితే చైనా ప్రభుత్వం ఈ నిరసనను అణచివేసేందుకు మిలటరీని ప్రయోగించింది. యుద్ధట్యాంకులు, ఫిరంగులతో నిరసనకారులను చెదరగొట్టడానికి  మిలటరీ వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి వాటికి ఎదురుగా వచ్చి నిలబడి తన నిరసన తెలిపాడు. చైనా మిలటరీ అతనిని కొట్టి ఈడ్చిపారేసింది. ఆ తరవాత అతనికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. యుద్ధట్యాంకులకు ఎదురుగా నిలబడి నిరసన తెలుపుతన్న సమయంలో జెఫ్ వైడ్‌నర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు. చైనా ప్రభుత్వం ఈ ఫొటోను నిషేధించింది.
 
 కదిలించిన చిత్రం....
 చిగురిస్తుందా మానవత్వం?

 
ఇటీవల కాలంలో పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమై యూరప్ ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసి..ప్రపంచం ముందు ఆ దేశాలను బోనెక్కించి దోషిగా నిలబెట్టిన బాలుడి చిత్రమిది. నిలోఫర్ డెమిర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు.  అగ్రదేశాల స్వప్రయోజనాల మూలంగా గత నాలుగేళ్లుగా దావాగ్నిలా రగులుతున్న సిరియా నుంచి యూరప్‌కు పడవలో వలస పోతూ ప్రాణాలు పోగొట్టుకున్న మూడేళ్ల పసికందు. పేరు అయలాన్ కుర్దీ. శరణార్థుల పట్ల యూరోపియన్ దేశాలు వ్యవహరిస్తున్న దమననీతికి, సిరియా శరణార్ధుల దుర్భరస్ధితికి.. ఈ చిత్రం అద్దం పడుతోంది. యుద్ధవిమానాలు వేసే బాంబులకు, ఐఎస్ ఉగ్రవాదుల నరమేధానికి భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దొంగతనంగా, రహస్యంగా సిరియా నుంచి యూరప్ దేశాలకు వలసపోతున్న  ఎందరో  సామాన్య ప్రజల దయనీయ స్థితికి సజీవ తార్కాణమీచిత్రం. సిరియా అంతర్యుద్ధంలో అయలాన్ అన్న, అమ్మ కూడా చనిపోగా అతని తండ్రి మాత్రం ప్రాణాలతో మిగిలాడు.  అయలాన్ కర్దీ మాదిరే సిరియా నుంచి సమీపంలోని యూరోపియన్ దేశాలకు వలసపోతూ  నిత్యం అనేక మంది పౌరులు మృత్యువాత పడుతున్నారు.  రాకాసి అలలు కాటేసినప్పుడు..తీరప్రాంత గస్తీదళాలు ఒడ్డుకు చేరుకుంటున్న వారిని నిర్దయగా వెనక్కి నెట్టేసినప్పుడు కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. పడవల్లో లెక్కకు మించి ఉండటం వల్ల.. ప్రయాణ మార్గంలో ఊపిరాడక మరికొందరు చనిపోతున్నారు. ఈ అడ్డంకులన్ని దాటుకుని యూరప్‌లోకి ప్రవేశిస్తే సరిహద్దుల్లో ముందుగా ముళ్ల కంచెలు స్వాగతం పలుకుతాయి. పోలీసుల వాటర్ క్యానన్‌లు, రబ్బరు బుల్లెట్లు వెన్నాడుతాయి. వీటిని దాటుకుని ఏదైనా గ్రామంలోకి ప్రవేశిస్తే జాత్యహంకార దూషణలు, దాడులు.. ఈ క్రమంలో ఒక కుటుంబంగా వచ్చిన వారు చెల్లా చెదురై చెట్టుకొకరు..పుట్టుకొకరుగా ఒంటరిగా మిగిలి..చావలేక బతకలేక అత్యంత దుర్భరమైన, దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు.  ఈ ఏడాదిలో ఇప్పటివరకు మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో ఇప్పటివరకు 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. సిరియా, నైజీరియా, గాంబియా వంటి దేశాల నుంచి ఇంతవరకూ 3,50,000 మంది యూరప్‌లోకి ప్రవేశించారని సమాచారం.
 
 సిరియాలోని కొబాని పట్టణాన్ని ఐఎస్ తీవ్రవాదులు
 ధ్వంసం చేస్తే...
 తన పిల్లలకు భయంలేని
 సురక్షిత జీవితాన్ని, మంచి భవిష్యత్తును  ఇవ్వాలనే ఏకైక కోరికతో...
 పుట్టిన గడ్డని వదిలి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, అత్యంత ధైర్యంతో, సాహసంతో ...
 కుటుంబంతో వందల కిలోమీటర్లు
 పడవలో ప్రయాణించి...
 గమ్యం చేరకుండానే తన పిల్లలను పొగొట్టుకున్న
 ఆ తండ్రి బాధ వర్ణాతీతం...

 
 
 పసిమనసులపై ఉగ్రపంజా..
 చూడగానే ముద్దొచ్చే ఈ పాలబుగ్గల చిన్నారి ఫొటో కూడా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో  విపరీతంగా హల్‌చల్ చేసింది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుండగా..కెమెరాను తుపాకీగా భావించిన ఆ బాలిక..భయంతో చేతులు పెకైత్తి నిలబడి పోయింది. ఈ దృశ్యాన్ని చూసిన వారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. నిత్యం బాంబులు, తుపాకీలు మధ్య లక్షలాది మంది చిన్నారులు ఈ నరకకూపంలో బతుకు వెళ్లదీస్తున్నారు. పసి మనసుపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో సజీవ తార్కాణం.
 


 బోపాల్ గ్యాస్ ఉదంతం
 అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనల్లో బోపాల్ గ్యాస్ ఉదంతం ఒకటి. 1984లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీకవటం వల్ల సుమారు 15,000 మంది ప్రజలు చనిపోయారు.  5 లక్షల మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన తన కొడుకుని ఓ తండ్రి పూడ్చిపెడుతున్నటప్పుడు తీసిన చిత్రమిది. ఆ దుర్ఘటన తీవ్రతను తెలిపే సజీవ తార్కారణం ఈ ఫొటో.
 


 
 కంపించిన అమెరికా
 న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానంతో ఢీకొడుతున్నప్పుడు తీసిన చిత్రమిది. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి...చిచ్చుపెట్టి తన స్వప్రయోజనాలు నెరవేర్చుకునే అమెరికాకు అల్‌ఖైదా తీవ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న ఈ దాడితో ముచ్చెమలు పట్టించారు. భయకంపితుల్ని చేశారు. ఉగ్రవాదులు పక్కా వ్యూహంతో అమెరికాకు చెందిన విమానాలను హైజాక్ చేసి.. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో 2,752  మంది ప్రజలు మరణించారు.

మరిన్ని వార్తలు