చావు, బతుక్కి మధ్య అర క్షణం; షాకింగ్‌ వీడియో

18 Jan, 2018 16:19 IST|Sakshi

సెలేమ్‌(యూఎస్‌) : ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఓ పోలీసాయన దోస్తులతో కలిసి సరదాగా చేపలవేటకు వెళ్లి.. అట్నుంచే మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చాడు! కొలంబియా నదిలో చిన్న చేపల పడవను భారీ స్పీడ్‌ బోటు ఢీకొట్టిన ఘటన తాలూకు వీడియో నెటిజన్లను గగుర్పాటుకు గురిచేస్తోంది.

క్షణాల్లో కకావికలం : బ్రియాన్‌ మెస్‌ అనే పెద్దమనిషి ఆరెగాన్‌ రాష్ట్రంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఓ సెలవునాడు తన స్నేహితులైన రోనీ డుర్హామ్‌, క్రిస్టోఫర్‌ మెక్‌మహూన్‌లను వెంటేసుకుని కొలంబియా నదిలో చేపలవేటకు వెళ్లాడు. కాలం సరదాగా గడుస్తుండగా.. దూరం నుంచి తెల్లటి మృత్యుశకటం దూసుకొస్తున్నట్లు కనిపించింది. దాదాపు 30 అడుగుల పొడవున్న ఆ తెల్లటి స్పీడ్‌బోటు.. కొద్దిసేపట్లోనే చేపల పడవను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. పడవలోని ఆ ముగ్గురూ నీళ్లలోకి దూకడం క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయేవారే!

డ్రైవర్‌ వింత వాదన.. బాధితుల భారీ దావా : 2017, ఆగస్టులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్పీడ్‌ బోటు యజమానిపై మార్లిన్‌ లార్సెన్‌పై కేసు నమోదయింది. అయితే జరిగినదాంట్లో తన తప్పేమీ లేదని, డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నప్పుడు.. ఎదురుగా ఉన్న బోటు కనిపించలేదని లార్సెన్‌ వాదించాడు. తద్వారా పరిహారం చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బాధితులు మాత్రం ముమ్మాటికీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద సమయంలో స్పీడ్‌ బోటు డ్రైవర్‌ లార్సెన్‌.. మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ కనిపించాడని కోర్టుకు చెప్పారు. ఓ మోస్తారు గాయాలతో బయటపడిన బాధితులు ముగ్గురూ.. భారీ పరిహారాన్ని డిమాండ్‌ చేస్తూ స్పీడ్‌ బోటు డ్రైవర్‌పై మరో దావా వేశారు.

మరిన్ని వార్తలు