అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

20 Mar, 2018 19:49 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. మేరిల్యాండ్‌లోని ఓ హైస్కూల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, అనేకమంది ఈ కాల్పుల బారిన పడ్డారని సెయింట్‌ మేరీస్‌ షెరీఫ్‌ చెప్పినట్టు స్థానిక న్యూస్‌ మీడియా రిపోర్టు చేసింది. స్కూల్‌ అధికారులు ఈ కాల్పులను ధృవీకరించారు. ప్రస్తుతం ఈ క్యాంపస్‌ను లాక్‌డౌన్‌ చేశారు. అయితే కాల్పుల బారిన పడ్డ వారి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియరాలేదని ఏబీసీ న్యూస్‌ రిపోర్టు చేసింది. దక్షిణ వాషింగ్టన్‌కు 70 మైళ్ల దూరంలో ఉన్న సెయింట్‌ మేరీస్‌ కంట్రీ గ్రేట్‌ మిల్స్‌ హైస్కూల్‌లో ఉదయం 8 గంటలకు దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. 

షెరిఫీ ఆఫీసు ఈ ఘటనను ధృవీకరించింది. ఇటీవల అమెరికా స్కూళ్లు కాల్పులతో మోతమోగుతున్నాయి. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో మార్జోరీ స్టోన్మాన్ డగ్లస్ హై స్కూల్లో ఫిబ్రవరి 14న జరిగిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. గ్రేడ్‌ మిల్స్‌ హై స్కూల్‌లో 1500 మందికి పైగా విద్యార్థులున్నారు. విద్యార్థులను స్కూల్‌ నుంచి తరలిస్తున్నట్టు కంట్రీ అధికార ప్రతినిధి టోని జోన్స్‌ తెలిపారు. షరీఫ్‌ ఆఫీసు ఈ ఘటనపై విచారణ ప్రారంభించిందని సెయింట్‌ మెరీస్‌ కంట్రీ పబ్లిక్‌ స్కూల్స్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. లియోనార్డ్‌ టౌన్‌లోని ఫారెస్ట్ కెరీర్ టెక్నికల్ సెంటర్‌కు విద్యార్థులను తరలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమకు తమ పిల్లలను చూపించాలంటూ కోరుతున్నారు. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారో కూడా ఇంకా తెలియరాలేదు. ఫస్ట్‌-పిరియడ్‌ క్లాస్‌ అయిపోయిన తర్వాత స్నేహితులతో కలిసి బయట నిల్చున్న సమయంలో తనకు ఈ కాల్పుల మోత వినబడినట్టు ఓ విద్యార్థి తెలిపాడు.

మరిన్ని వార్తలు