గడ్డకట్టే చలిలో స్నానమంటే...

28 Jan, 2020 17:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాకు సమీపంలోని సైబీరియా. అక్కడి ఉష్ణాగ్రతల గురించి తెలుసుకుంటేనే మనకు నిలువెల్లా వణకు పుట్టాల్సిందే! శీతల కాలంలో మైనస్‌ డిగ్రీలకు పడిపోయే అతి శీతల ప్రాంతాల్లో మానవులు ఆ కొద్దికాలం చలిని తట్టుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ఎప్పుడూ మైనస్‌ డిగ్రీల సెల్సియెస్‌ అంటే, మైనస్‌ ఐదు నుంచి మైనస్‌ 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండే సైబీరియా ప్రాంతంలో నివసించాలంటే నిత్య పోరాటమే. కానీ అది అక్కడి స్థానికులకు అంతగా వర్తించదు.

అతిశీతలంగా ఉండే సైబీరియాలోని యకుటియా ప్రాంతంలో నివసిస్తున్నవారు అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. అక్కడ వేడి నీళ్లలో చొక్కా, పైజామా ఉతికి ఆరేసే లోపే అవి గడ్డకట్టుకుపోయి మంచు విగ్రహాల్లా తయారవుతాయి. వేడి నీళ్లలోనూ ఆకాశంలోకి కుమ్మరిస్తే ఆకాశంలోనే గడ్డ కట్టుకుపోయి మంచులా కురుస్తుంది. వేడి వేడి న్యూడిల్స్‌ దింతామన్న లోపే అది గాలిలోనే గడ్డకుపోతాయి, కొన్ని వేడి వేడి తిను పదార్థాలైతే నోటిలోకి పోగానే గొంతులో గడ్డకట్టుకు పోతాయట. గత వారం ఓ పర్యాటక బృందం అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ నిజంగా మైనస్‌ 59 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంది. 

అంతటి శీతల మంచు ప్రాంతంలో ఓ స్కూల్‌ టీచర్‌ గలైనా డావిడోవా, బట్టలుతికితే అవి ఎలా క్షణాల్లో గడ్డకట్టుకుపోతాయో చూపించారు. గ్లాసులో పోసిన వేడి వేడి నీళ్లు క్షణాల్లో ఎలా మంచుగా మారుతాయో చూపారు. అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే సమీపంలోని చురాప్చా కుగ్రామంలో మంచుతో కూడిన నీటి గుంటలో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్నానం చేయడం. అలాంటి నీళ్లలో స్నానం చేస్తే తప్పా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించదని ఆ వృద్ధుడు తెలిపారు. సైబీరియాలో కుగ్రామాలే కాదు, పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. శీతాకాలంలో మాస్కో నగరంలో మంచు కురిసినట్లు అక్కడి గ్రామల్లో, నగరాల్లో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటోంది. మంచు నీటిలో, మంచులో దొరికే చేపలు అక్కడి ప్రజలకు ప్రధాన ఆహారం. చలిని తట్టుకునేందుకు వారు చలి కోట్లు, చలి ప్యాంట్లు, చలి టోపీలు ధరిస్తారు. 

మరిన్ని వార్తలు