ఆలస్యపు నిద్రతో అనారోగ్యం!

18 Sep, 2019 03:02 IST|Sakshi

నిద్రకీ నడుము కొలతకీ సంబంధం

సోషల్‌ జెట్‌లాగ్‌తో పెరుగుతోన్న కొవ్వు

న్యూయార్క్‌: ఆలస్యం.. అమృతం.. విషం.. అంటారు. అయితే నిద్రపోయే విషయంలో ఆలస్యం అమృతం కానేకాదని.. కచ్చితంగా విషమేనని అంటోంది తాజా అధ్యయనం. ప్రత్యేకించి టీనేజ్‌ అమ్మాయిల బరువు పెరుగుదల విషయంలో ఇది అక్షరాలా నిజమని పేర్కొంది. ఆలస్యంగా నిద్రపోయే అమ్మాయిల్లో బరువు పెరిగే ప్రమాదం అధికమని తేల్చి చెప్పింది. న్యూయార్క్‌లో జరిపిన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల జామా పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 11 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న 418 మంది బాలికలు, 386 మంది మగపిల్లలను ప్రశ్నించారు.

నిద్రకు సంబంధించిన అలవాట్లను రికార్డు చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని పిల్లల చేతి మణికట్టుపై అధ్యయన కాలంలో ధరించారని అమెరికాలోని ఆరోగ్య సంస్థ కైసర్‌ పర్మనెంట్‌ పరిశోధకులు తెలిపారు. అనంతరం డ్యూయల్‌ ఎక్స్‌రే అబ్సార్ప్షియోమెట్రీ విధానాన్ని ఉపయోగించి పిల్లల శరీరంలోని కొవ్వు నిష్పత్తిని కొలిచారు. అదేవిధంగా పిల్లల నడుము పరిమాణాన్ని రికార్డు చేశారు. వీటితో పిల్లల సోషల్‌ మీడియా వాడటం వల్ల వారంపాటు నిద్రపోయే సమయంలోనూ, వారాంతాల్లో నిద్రపోయే సమయంలోనూ తేడాని సైతం గమనించారు. వారం రోజుల్లో కన్నా, వారాంతంలో ఆలస్యంగా నిద్రిసున్న వారిలో సామాజిక మాద్యమాల వాడకం వల్ల వచ్చే బద్ధకం (సోషల్‌ జెట్‌లాగ్‌) ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 

ప్రధానంగా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించే యుక్తవయసు బాలికల నడుము చుట్టుకొలతలు 0.58 సెంటీమీటర్లు అధికంగా ఉన్నాయని, వారి శరీరంలో 0.16 కిలోగ్రాముల కొవ్వుపెరిగినట్లు అధ్యయనంలో తేలింది. 

గంట గంటకీ పెరిగే కొవ్వు..
ప్రతి గంట సోషల్‌ జెట్‌లాగ్‌ కారణంగా యుక్తవయసు బాలికల్లో 1.19 సెంటీమీటర్ల మేర నడుము కొలత, శరీరంలోని కొవ్వు 0.45 కిలోగ్రాములు పెరుగుతున్నట్టు వెల్లడైంది. బరువు పెరుగుదలకు కారణమయ్యే ఇతర అంశాలైన నిద్రించే సమయం, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ, టీవీ చూసే సమయం తదితర అంశాలను వేరుచేసినప్పటికీ నడుము కొలతల్లోనూ, కొవ్వు శాతంలోనూ తేడా అలాగే కొనసాగినట్లు తేలింది. అయితే అబ్బాయిల్లో సైతం కొన్ని తేడాలు గమనించినప్పటికీ అవి అంతగా చెప్పుకోదగినవి కావని వెల్లడించింది. అందుకే నిర్దిష్టంగా నిద్రపోవడం వల్ల బాల్యంలోనూ, యవ్వనంలోనూ వచ్చే స్థూలకాయాన్ని నివారించవచ్చని అధ్యయనకారులు సూచిస్తున్నారు.   

మరిన్ని వార్తలు