భారతీయ రైతుకు అరుదైన గౌరవం

13 Nov, 2018 04:09 IST|Sakshi

కెనడా ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు

కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికిగాను భారతీయ రైతుకు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ‘కెనడియన్‌ అగ్రికల్చరల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ (సీఏహెచ్‌ఎఫ్‌ఏ)’ లో రైతు పీటర్‌ పావిటర్‌ ధిల్లాన్‌ పేరును చేర్చారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్‌ఎఫ్‌ఏలో చేర్చి వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది. కెనడాలోనే అత్యధిక క్రాన్‌బెర్రీ పంటను పండించినందుకుగాను ధిల్లాన్‌ను సంస్థ ఇలా గౌరవించింది. పంజా బ్, హోషియార్‌పూర్‌లోని పాండోరి గ్రామం నుంచి 1950లో ధిల్లాన్‌ తండ్రి రాచ్‌పాల్‌ సింగ్‌ ధిల్లాన్‌ కెనడాకి వచ్చారు.

19 ఏళ్ళ వయస్సులోనే రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌లో చేరిన తొలి ఇండో కెనడియన్‌గా పీటర్‌ ధిల్లాన్‌ గుర్తింపు పొందాడు. అనతి కాలంలో డిప్యూటీ షరిఫ్‌గా ధిల్లాన్‌ ఎదిగారు. బ్రిటన్‌లో లా పూర్తిచేశాక ధిల్లాన్‌ కుటుంబం 1993లో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ధిల్లాన్‌ ఏకంగా 2000 ఎకరాల్లో క్రాన్‌బెర్రీ పండిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక క్రాన్‌బెర్రీ సాగుచేస్తున్నవారిలో ధిల్లాన్‌ రెండో స్థానంలో ఉన్నారు. రిచ్‌మండ్, బ్రిటిష్‌ కొలంబియాల్లో రిచ్‌బెర్రీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేరుతో క్రేన్‌బెర్రీ ఉత్పాదక పరిశ్ర మను నిర్వహిస్తున్నారు.

గత ఏడాదిలో రిచ్‌బెర్రీ గ్రూప్‌ రూ.188 కోట్ల విలువైన క్రాన్‌బెర్రీలను పండించింది. అమెరికా, కెనడా ల్లోని క్రాన్‌బెర్రీ మార్కెటింగ్‌ కో–ఆపరేటివ్‌ ‘ఓషియన్‌ స్ప్రే’కి «ప్రస్తుతం దిల్లాన్‌ చైర్మన్‌. «2014లో తొలిసారిగా దిల్లాన్‌ ఓషియన్‌ స్ప్రేకో ఆపరేటివ్‌ సొసైటీకి శ్వేతజాతీయేతర చైర్మన్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. ఓషియన్‌ స్ప్రేకి చెందిన 2.5 బిలియన్‌ డాలర్ల ఖరీదైన ఉత్పత్తులు ప్రతియేటా అమ్ముడవుతున్నాయి. త్వరలో భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టాలన్న యోచనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు