భారత్‌కు మరో సింగపూర్ ఎయిర్‌లైన్స్

22 Apr, 2016 20:23 IST|Sakshi

హైదరాబాద్ : చవక విమానయాన సేవల రంగంలో మరో సంస్థ భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ మే నెలలో భారత్‌లో అడుగు పెట్టనుంది. మే 24న సింగపూర్ కేంద్రంగా చెన్నైతోపాటు అమృత్‌సర్ నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తోంది. సింగపూర్-చెన్నై-సింగపూర్‌కు ప్రతిరోజు, సింగపూర్-అమృత్‌సర్-సింగపూర్‌కు వారంలో మూడు రోజులు విమానాలు నడుస్తాయి. అక్టోబరు 2 నుంచి జైపూర్‌కు విస్తరించనున్నట్టు స్కూట్ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. సింగపూర్-జైపూర్-సింగపూర్‌కు వారంలో నాలుగు సర్వీసులు నడుపుతారు. కంపెనీ ద్వితీయ శ్రేణి నగరాలకూ సేవలను పరిచయం చేయనుంది. ముఖ్యంగా పర్యాటకంగా వ్యాపార అవకాశాలు ఉన్న కొత్త నగరాల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

స్కూట్ భారత్‌లో 375 సీట్ల వరకు సామర్థ్యం ఉన్న వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నడుపనుంది. మరో లో కాస్ట్ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఆసియా మాత్రమే ప్రస్తుతం ఈ విమానాలను భారత్‌కు నడుపుతోంది. 2012లో ప్రారంభమైన స్కూట్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన నాల్గవ బ్రాండ్‌గా నిలవనుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు సంస్థకు చెందిన సిల్క్ ఎయిర్, టైగర్ ఎయిర్ ఇప్పటికే మన దేశంలో సేవలను అందిస్తున్నాయి. ఇక విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం, టాటా సన్స్‌కు 51 శాతం వాటా ఉంది.

సింగపూర్‌కు 64 డాలర్లు..

భారత్‌లో సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28 వరకు పరిమిత కాల ఆఫర్‌ను స్కూట్ ప్రకటించింది. భారత్ నుంచి స్కూట్ నెట్‌వర్క్‌లోని అన్ని నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, అమృత్‌సర్, జైపూర్ నుంచి సింగపూర్‌కు ఎకానమీ టికెట్ ఒకవైపు ప్రయాణానికి 64 డాలర్ల నుంచి ప్రారంభం. సిడ్నీకి 189 డాలర్ల నుంచి లభిస్తాయి. టికెట్ల ప్రారంభ ధర బిజినెస్ క్లాస్‌లో సింగపూర్‌కు 179 డాలర్లు, సిడ్నీకి 459 డాలర్లుగా నిర్ణయించింది. కాగా స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానంలో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది.

మరిన్ని వార్తలు