సంచలన గాయనికి చెప్పుకోలేని చేదు అనుభవం!

26 Feb, 2020 13:14 IST|Sakshi

లండన్‌: పాప్‌ స్టార్‌ డఫ్ఫీ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సామ్రాజ్యానికి పరిచయం  అక్కర్లేని పేరు. తన అద్భుత గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్రిటీష్‌ గాయని కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు డఫ్ఫీ ఎక్కడ? ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? అని గొంతెత్తి అరిచినా లాభం లేకపోయింది. కానీ ఓ జర్నలిస్టు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించి, ఆచూకీ కనుగొన్నాడు. తీరా ఆమెను పలకరించగా గాయనికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని ద్రవించిపోయాడు. ఆమెకు ఎంతగానో ధైర్యం చెప్పడంతో తిరిగి పదేళ్ల తర్వాత డఫ్ఫీ అభిమానులతో మనసు విప్పి మాట్లాడింది. తన గతం గురించి చెప్తూనే వర్తమానం, భవిష్యత్తు గురించి కలలు కంటోంది.

‘ఇది మీకు చెప్పడానికి ఎన్నిసార్లు నాలో నేనే మథనపడ్డానో మీరు ఊహించలేరు. కానీ ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాను. నేను కనిపించకపోయేసరికి నాకేం జరిగింది? ఎక్కడికి వెళ్లిపోయాను అని అభిమానులు కంగారుపడిపోయారు. నిజానికి నాకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేశారు. అలా కొద్ది రోజులపాటు నన్ను నిర్భందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను. కానీ నాకు జరిగిన ఈ ఘోరం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతకు మించి నేను చెప్పలేను’ అంటూ డఫ్ఫీ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

‘నా మనసు ముక్కలైన తర్వాత గుండె లోతుల్లోంచి పాట ఎలా పాడగలను అని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. అప్పుడు నా బాధ ప్రపంచానికి వినబడుతుందేమోనని ఆపివేశాను. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మళ్లీ నా మనసులోకి వెలుతురు వస్తోంది. దీనికోసం దశాబ్ధకాలంగా ఎదురు చూశాను. నేడు అది జరుగుతుందనిపిస్తుంది. నాపై చూపించిన మీ ప్రేమకు సర్వదా కృతజ్ఞురాలిని’ అని పేర్కొంది. దీనిపై ఆమె అభిమానులు స్పందిస్తూ డఫ్ఫీకి మద్దతుగా నిలబడుతున్నారు. కాగా ఆమె రూపొందించిన రాక్‌ఫెర్రీ ఆల్బమ్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది మూడుసార్లు బ్రిట్‌ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఒక గ్రామీ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2008లో విడుదలైన ఈ ఆల్బమ్‌ ఆ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయి రికార్డుకెక్కింది.

>
మరిన్ని వార్తలు