విమానంలో వింత..!

26 Oct, 2017 18:45 IST|Sakshi

కేవలం ఒకే ఒక్క ప్రయాణికురాలితో వెళ్లిన విమానం

వీఐపీ ట్రీట్ మెంట్‌పై మహిళ హర్షం

గ్లాస్గో : విమానంలో ఒకే ఒక్క ప్యాసింజర్ ప్రయాణించగా సిబ్బంది మాత్రం ఆమెను ఓ వీఐపీగా ట్రీట్ చేశారు. ఇది చదివి ఆ ప్యాసింజర్ బడా పారిశ్రామికవేత్తో, లేక పేరు మోసిన అధినేత అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఓ సాధారణ ప్రయాణికురాలు ఒంటరిగా విమానంలో ప్రయాణించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్కాట్లాండ్‌కు చెందిన కరోన్ గ్రీవ్ అనే మహిళ ఓ రచయిత్రి. ఆమె గత మూడు రోజుల కిందట గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్ అనే ప్రాంతానికి విమానంలో జర్నీ చేయాలనుకున్నారు.

జెట్ 2 అనే ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే 189 మంది సీట్ల సామర్థ్యం ఉన్న ఆ విమానంలో కేవలం మూడు టికెట్లే బుక్ అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ విమానం బయలుదేరే సమయానికి కేవలం కరోన్ గ్రీవ్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో సమయం మించిపోతుందని విమానం ఒక్క ప్రయాణికురాలితోనే వెళ్లిపోయింది. ఒకే ప్రయాణికురాలు కావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది గ్రీవ్‌కు వీఐపీలా చూసుకున్నారు. దీంతో విమాన సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. 'గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్‌కు జెట్ 2 విమానంలో ప్రయాణికురాలిని నేనొక్కదాన్నే. కెప్టెన్ లారా, ఇతర విమాన సిబ్బంది వీఐపీలా ట్రీట్ చేశారంటూ' కరోన్ గ్రీవ్ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా చోటుచేసుకుంటుందని విమాన సిబ్బంది తెలిపింది.
 

మరిన్ని వార్తలు