ఏడాది పాటు కండోమ్ అక్కర్లేదట!

30 Mar, 2016 14:12 IST|Sakshi
ఏడాది పాటు కండోమ్ అక్కర్లేదట!

చాలాకాలం నుంచి పురుషులు ఎదురు చూస్తున్న ఆవిష్కరణ దాదాపు సిద్ధమైపోయింది. ఏడాది పాటు కండోమ్‌లు వాడక్కర్లేకుండా వాసాజెల్ అనే ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పురుషులు గర్భనిరోధక పద్ధతులు పాటించాలంటే ఉన్న మార్గాలు రెండే. శాశ్వతంగా అయితే వాసెక్టమీ చేయించుకోవడం, తాత్కాలికంగా అయితే కండోమ్‌లు వాడటం. అయితే, కండోమ్‌లు వాడుతున్నా కూడా 18 శాతం కేసుల్లో వాళ్ల భాగస్వాములు గర్భం దాలుస్తున్నట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. అందువల్ల తాత్కాలికంగా కొన్నాళ్లపాటు తమ భాగస్వాములకు గర్భం రాకూడదని అనుకుంటే నూటికి నూరుశాతం సురక్షిత విధానం అన్నది ఇంతవరకు లేదు.

ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న వాసాజెల్ ఇంజెక్షన్‌ను మగ కుందేళ్లకు ఇచ్చినపుడు ఏడాది పాటు వాటి వల్ల సంతానం కలగలేదు. తాము అనుకున్నదాని కంటే మెరుగైన ఫలితాలే కనిపించాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇలినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డోనాల్డ్ వాలర్ తెలిపారు. ఈ ఇంజెక్షన్‌కు ఉన్న హైడ్రోజెల్ లక్షణాల కారణంగా ఇది సుదీర్ఘకాలం పాటు గర్భనిరోధకంగా పనిచేస్తుందని వాలర్ చెప్పారు. ప్రయోగంలో భాగంగా 12 కుందేళ్లకు వృషణాల నుంచి వీర్యం వెళ్లే మార్గంలో ఈ జెల్ ఇంజెక్ట్ చేశారు. వాటిలో 11 కుందేళ్లకు సెమెన్‌లో అసలు వీర్యకణాలు లేవని తేలింది. మిగిలిన ఒక్కదానికి కూడా అత్యంత తక్కువ సంఖ్యలోనే వీర్యకణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఏడాది చివర్లో మనుషులపై కూడా దీనిపై ఔషధ ప్రయోగాలు జరుగుతాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు