సీరీజ్ ముంగిట 'సూర్యోదయం'!

8 Mar, 2015 02:48 IST|Sakshi
సీరీజ్ ముంగిట 'సూర్యోదయం'!

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏడున్నరేళ్ల క్రితం ప్రయోగించిన 'డాన్' ఉపగ్రహం ఎట్టకేలకు సీరీజ్ మరుగుజ్జు గ్రహాన్ని చేరింది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సీరీజ్ చుట్టూ కక్ష్యలోకి వెళ్లింది. 61 వేల కి.మీ. దూరం నుంచే ఉపగ్రహాన్ని సీరీజ్ గురుత్వాకర్షణ శక్తితో లాక్కుందని, అయాన్ థ్రస్టర్(మోటారు)ను మండించి వేగాన్ని నియంత్రించుకుంటూ 'డాన్' సీరీజ్ కక్ష్యలోకి చేరింది.

సీరీజ్ కక్ష్యలోకి చేరాక డాన్ నుంచి సంకేతాలు అందాయని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తెలిపింది అయితే, సీరీజ్‌కు  చీకటివైపు నుంచి కక్ష్యలోకి చేరినందున, వచ్చే నెల నుంచే ఆ గ్రహం పగటి భాగం డాన్‌కు కనిపిస్తుందని, అందువల్లే అప్పటి నుంచే డాన్ ఫొటోలు తీసి పంపనుందని పేర్కొంది. అంగారక, గురు గ్రహాల మధ్య  అతిపెద్ద ఖగోళ వస్తువైన సీరీజ్‌ను 1801లో కనుగొన్నారు. ఈ గ్రహం ఉపరితలంపై నీరు ఉందని,  దానితో వ్యోమగాములు ఆక్సిజన్ తయారుచే సుకోవచ్చని భావిస్తున్నారు. సౌరకుటుంబం ఏర్పడినప్పుడు గురు గ్రహం ప్రభావం వల్ల ఇది పూర్తిస్థాయి గ్రహంగా ఏర్పడలేదని, దీనిపై పరిశోధనతో గ్రహాల ఆవిర్భావం గురించి తెలుసుకోవచ్చంటున్నారు.

మరిన్ని వార్తలు