కదలకుండా కూర్చుంటే కష్టాలే!

4 May, 2018 22:44 IST|Sakshi

టోక్యో : కాసేపు కదలకుండా ఒక చోట కూర్చున్నామంటే చాలు కాళ్లు చేతులూ తిమ్మిర్లు పట్టి ఇబ్బంది పెడతాయి. ఇక కొన్ని గంటలపాటు ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు కదలకుండా అలానే కూర్చుండిపోతాము. అలా కూర్చుంటే  సిరల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  ముఖ్యంగా కాళ్లు, చేతులు, పొత్తికడుపు కింది భాగాల్లో రక్తం గడ్డకడుతుందని జపాన్‌లోని  కుమమోటో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇలా గడ్డకట్టడాన్ని వైద్య పరిభాషలో వీనస్‌ థ్రాంబోఎంబోలిసమ్స్‌(వీటీఈ) అంటారు.  2016 ఏప్రిల్‌లో జపాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత చాలామంది ఆసుపత్రి పాలయ్యారు.

దీంతో 21 మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి రోగుల డేటాను పరిశోధన కోసం కేటాయించారు. వీరిలో దాదాపు 51 మంది వీటీఈ కారణంగా చికిత్స చేయించుకున్నారని గుర్తించి, వారి నుంచి వివరాలు సేకరించగా.. అందులో 42 మంది రోగులు ఒక రాత్రిమొత్తం కార్లలో ఉండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తేలింది. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని శాస్త్రవేత్తలో ఒకరైన సీజీ హోకిమోటో తెలిపారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయో చెప్పేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ అని, ఎక్కువ  సమయం  ప్రయాణం చేయాల్సి వస్తే  అప్పుడప్పుడూ లేచి నడుస్తుండాలని సీజీ సూచించారు.   

మరిన్ని వార్తలు