ఈ దృశ్యాన్ని చూసి జడుసుకోవాల్సిందే!

1 Oct, 2019 17:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎవరు ఈ దృశ్యాన్ని చూసినా జడుసుకోవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త ఆడమ్‌ థార్న్‌ ముఖానికి అద్దాల ఫేస్‌మాస్క్‌ ధరించి ఆరడుగుల కొండ చిలువతో చిన్న ఫైట్‌కు దిగారు. కుడి చేతిని మోచేతి వరకు గట్టిగా మడిచి దమ్ముంటే తనపై దాడి చేయమని సవాల్‌ చేసినట్లున్నారు. ఆ కొండ చిలువ హఠాత్తుగా పైకి లేచి బార్లా తెరిచిన నోటితో థార్న్‌ మోచేతిని గట్టిగా పట్టి పీకింది. ఆ మంటను పంటి భిగువున థార్న్‌ భరించాల్సి వచ్చింది. పాములను పట్టడంలో అపార అనుభవం కలిగిన మిత్రుడు రాబ్‌ అల్లేవా సమక్షంలో ఈ ఫీటు నడిచింది. గట్టిగా థార్న్‌ చేతిని పట్టుకున్న కొండ చిలువను రాబ్‌ అల్లేవా లాగేశాడు. ఈ క్రమంలో కొండ చిలువ ఆయన్ని కూడా కాటేసింది. అనంతరం కొండ చిలువ పట్టి పీకిన చోట థార్న్‌ కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది.

వీరిద్దరు ‘హిస్టరీ ఛానెల్‌’లో ప్రసారం చేయడం కోసం ‘కింగ్స్‌ ఆఫ్‌ పెయిన్‌’ పేరిట ఓ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా థార్న్‌ ఈ ఫీట్‌ను నిర్వహించారు. ఈ సిరీస్‌ డాక్యుమెంటరీలో భాగంగా వీరిద్దరు కొన్ని వందల సార్లు వివిధ రకాల పాములు, జంతువులతో ఇలా కరిపించుకున్నారు. థార్న్‌ వన్యప్రాణి బయోలజిస్ట్‌. తన మిత్రుడు రాబ్‌తో కలిసి ప్రపంచంలోని పలు దట్టమైన అడవుల్లోకి వెళ్లి వివిధ రకాల పాములు, జంతువులతోపాటు పలు రకాల కీటకాలతో కరిపించుకొని ఏది కరిస్తే ఎంత బాధ, ఎంత సేపుంటుందో ప్రజలకు తెలియజేసేందుకు ఓ 30 పాయింట్ల స్కేలును తయారు చేసి దానిపై నమోదు చేస్తూ వస్తున్నారు.

1980వ దశకంలో క్రిమికీటకాలు కరిస్తే ఎంత బాధ ఉంటుందో తెలియజేయడానికి ఎ ‘సూచిక’ను రూపొందించిన డాక్టర్‌ జస్టిన్‌ ష్మిడ్‌ను ఆదర్శంగా తీసుకొని వారు ఈ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. వారు ఇప్పటి వరకు భారీ బల్లులు, లైన్‌ ఫిష్‌గా వ్యవహరించే ప్రమాదకరమైన చేపలు, కొన్ని విష సర్పాలతో ఇలాంటి ఫీట్లు చేశారు. కొండ చిలువల కోరలకు విషయం ఉండక పోయిన ఓ మనిషిని చంపి తినేంతటి శక్తి ఉంటుందన్న విషయం తెల్సిందే.

 

మరిన్ని వార్తలు