ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!

23 Aug, 2019 17:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు నాలుగు మందుల మిశ్రమం కలిగిన ఒక చిన్న టాబ్లెట్‌ వేసుకోవడం ద్వారా దేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఓ తాజా వైద్య అధ్యయనం వెల్లడించింది. తద్వారా ‘జాతీయ ఆరోగ్య స్కీమ్‌’ కింద ప్రభుత్వానికి ఖర్చవుతున్న కోట్లాది రూపాయలను ఆదా చేయవచ్చని కూడా ఆ అధ్యయనం సూచించింది. ఆస్ప్రిన్, స్టాటిన్‌ మందులతోపాటు రక్తపోటును నియంత్రించే ఏవైనా రెండు మందులతో కూడిన ‘పోలి పిల్‌’ వేసుకుంటే గుండెపోటు రాకుండా చేయవచ్చని అధ్యయనం జరిపిన వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ఎలాంటి గుండె జబ్బులు లేని వారు కూడా ఈ ‘పోలి పిల్‌’ వేసుకుంటే వారిలో 40 శాతం వరకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్పారు. 

పలు మందుల మిశ్రమ‘ పోలి పిల్స్‌’ గురించి గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో అధ్యయనాలు కొనసాగుతున్నా తాజా అధ్యయనమే సత్ఫలితాలిచ్చాయని వైద్యులు తెలిపారు. పైగా ఒక్క ట్యాబ్లెట్‌కు భారతీయ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఏడువేల మందిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరపడం వల్ల ఈ ‘ పోలి పిల్‌’ ప్రభావాన్ని అధ్యయనం చేయగలిగామని వైద్యులు ‘ది లాన్సెట్‌’ పత్రికలో వివరించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ‘స్టాటిన్‌ ట్యాబ్లెట్ల’తోపాటు బీపీ మందులు వాడుతున్నారని, వారు అనేక మందులు తీసుకునే బదులు రోజుకో ట్యాబ్లెట్‌ తీసుకుంటే సరిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న బర్మింగమ్‌ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్‌ టామ్‌ మార్శల్‌ తెలిపారు. ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 50 ఏళ్ల వయస్సు దాటిని వారంతా ఈ ‘పోలి పిల్‌’ వాడడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు