-

విమానాన్ని రెండు రోజులు ఆపేసిన ఎలుక!

29 Aug, 2016 08:24 IST|Sakshi
విమానాన్ని రెండు రోజులు ఆపేసిన ఎలుక!

ఓ చిన్న ఎలుక కారణంగా ఎయిర్ ఫ్రాన్స్ విమానం రెండు రోజులు ఆలస్యమైంది. బమాకో నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన ఈ విమానంలో చిన్న చుంచెలక దూరి అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రయాణికులందరినీ కిందకు దించేసి.. అది ఎక్కడుందో వెతుకుదామని ఎంత ప్రయత్నించినా ఎవరికీ చిక్కలేదు. ఎట్టకేలకు దాని ఆచూకీని పసిగట్టి బయటకు తీసేసరికి.. కేబిన్ సిబ్బంది అలసట లేకుండా పనిచేయడానికి వారికి కేటాయించిన సమయం కాస్తా పూర్తయిపోయింది.

దాంతో వెంటనే వాళ్లు విమానాన్ని తీసుకెళ్లడం కుదరలేదని ఎయిర్‌ఫ్రాన్స్ అదికార ప్రతినిధి క్రిస్టోఫ్ పామియర్ చెప్పారు. చివరకు విమానం 48 గంటలు.. అంటే సరిగ్గా రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరింది. విమానంలో ఎలుకలు దూరితే చాలా ప్రమాదం సంభవిస్తుంది. కీలకమైన కేబుళ్లను అవి కొరికేస్తాయి కాబట్టి ఏమైనా జరగొచ్చు. ఇంత ఆలస్యం అయినందుకు ప్రయాణకులకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నామని, తమకు ప్రయాణికులు.. సిబ్బంది భద్రతే అత్యధిక ప్రాధాన్యమైన అంశమని ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు