నత్తల ఇన్సులిన్...సూపర్ ఫాస్ట్!

14 Sep, 2016 00:38 IST|Sakshi
నత్తల ఇన్సులిన్...సూపర్ ఫాస్ట్!

డయాబెటిస్ నియంత్రణకు ఇన్సులిన్ వాడటం తెలిసిందే.. అయితే వాడిన 15 నిమిషాలకు కానీ దాని ప్రభావం కనిపించదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ అర్లింగ్టన్ (యుటా) శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం త్వరలోనే వేగంగా పనిచేసే ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఓ రకమైన నత్తలు తమ శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇన్సులిన్ వంటి రసాయనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని వారు గుర్తించారు. ఇది సాధారణ ఇన్సులిన్‌కు మూడు రెట్లు ఎక్కువ వేగంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు

కాలేయం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ తక్కువైనపుడు కృతిమ ఇన్సులిన్‌ను తీసుకుంటాం. అయితే ఇది శరీరంలోకి చేరాక అందులోని ఆరు రసాయన అణువులు విడిపోయేందుకు కొంత సమయం పడుతుంది. అంటే అప్పటి వరకు దాని ప్రభావం కనిపించదన్నమాట. మానవుల్లో అయితే ఇది జరిగేందుకు 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. నత్తలు ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఉండదని, దీంతో 5 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని పరిశోధకులు వివరించారు. నత్తల ఇన్సులిన్ వంటి దాన్ని కృత్రిమంగా తయారు చేస్తే మానవులకు ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు