శనిగ్రహం చందమామపై మంచు మేఘం!

26 Oct, 2014 03:23 IST|Sakshi
శనిగ్రహం చందమామపై మంచు మేఘం!

వాషింగ్టన్: శనిగ్రహానికి సహజ ఉపగ్రహాల్లో ఒకటైన టైటాన్ ఉత్తర ధ్రువంపై మీథేన్ మంచు మేఘం ఏర్పడి ందట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యాసినీ వ్యోమనౌక తీసిన ఫొటోల్లో ఈ మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై వాతావరణంలో ఏర్పడే మేఘాల మాదిరిగానే ఉన్న ఈ మీథేన్ మంచు మేఘం శీతాకాల వాతావరణం కారణంగా ఏర్పడిందని భావిస్తున్నారు. టైటాన్ ఉత్తర ధ్రువంపై ఈథేన్ మంచు మేఘాలు ఏర్పడుతున్నట్లు గతంలోనే గుర్తించారు. వాటి కన్నా దట్టంగా ఉండే మీథేన్ మేఘాలు కూడా అక్కడి వాతావరణం కిందిపొరలో మాత్రమే ఏర్పడతాయని అనుకునేవారు. అయితే.. టైటాన్ వాతావరణం  పైపొరలోనూ ఇలాంటి మేఘాలు ఏర్పడతాయని తొలిసారిగా తెలిసిందని నాసా గాడార్డ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్త క్యారీ అండర్సన్ వెల్లడించారు.

భూమి మీద ఉపరితలం నుంచి నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురిసినట్లే.. టైటాన్‌పై కూడా మేఘాలు ఏర్పడి అవపాతం మాదిరిగా పడతాయని, అయితే అక్కడ నీటికి బదులు మీథేన్ వర్షం పడుతుందని ఆయన తెలిపారు. రుతువులకు అనుగుణంగా శీతాకాలంలో ఈ మేఘాలు ఎలా ఏర్పడుతున్నాయన్న దానిపై మరింత లోతుగా అధ్యయనం చేయనున్నట్లు క్యాసినీ డిప్యూటీ ప్రాజెక్టు శాస్త్రవేత్త స్కాట్ ఎడ్జింగ్టన్ వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు