మామ.. ‘మంచు’మామ! 

22 Aug, 2018 01:08 IST|Sakshi

చందమామపై మంచు ఆనవాళ్లు

వాషింగ్టన్‌: అత్యంత చల్లగా, చీకటిగా ఉండే చంద్రుడి ధృవ ప్రాంతాల్లో ఘనీభవించిన నీటి నిల్వలు(మంచు) ఉన్నట్లు నాసా వెల్లడించింది. పదేళ్ల క్రితం భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌–1 అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు నీటి నిల్వలున్న విషయాన్ని ధ్రువీకరించారు. చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ నీటిని వినియోగించుకోవడం చాలా కష్టతరమైందని అప్పట్లోనే వెల్లడించారు.

కానీ ప్రస్తుతం కనుగొన్న ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతోపాటు ఆవాసానికి అవసరమయ్యే నీటిని ఇక్కడి నుంచే పొందవచ్చని చెబుతున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద లూనార్‌ క్రేటర్స్‌ (ఉల్కాపాతం వల్ల ఏర్పడిన గుంత లాంటి ప్రదేశం)లో మంచు మొత్తం ఒకేచోట నిక్షిప్తమై ఉండగా.. ఉత్తర ధృవ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు. చంద్రయాన్‌–1 అంతరిక్ష నౌకలో మూన్‌ మినరాలజీ మ్యాపర్‌( M3) అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడిపై ఉపరితలంపై నీటి ఆనవాళ్లను నాసా గుర్తించింది.   

>
మరిన్ని వార్తలు