ఈ కుక్క మామూలు కుక్క కాదు!

19 Nov, 2019 12:11 IST|Sakshi

నేటి డిజిటల్‌ యుగంలో టిక్‌టాక్‌ యాప్‌ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోన్న ఈ చైనా యాప్‌ పట్ల చిన్నా, పెద్దా.. తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆకర్షితులవుతున్నారు. సినిమా డైలాగులు, పాటలు, భావోద్వేగాలకు అనుగుణంగా అభినయించిన వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. ఇలా టిక్‌టాక్‌ ద్వారా సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్న వారెందరో. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు.. టిక్‌టాక్‌ వీడియోల కారణంగా విడిపోతున్న జంటలు, ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలు, హత్యలు ఆందోళన కలిగించే అంశాలుగా పరణమిస్తున్నాయి. అయితే టిక్‌టాక్‌ కేవలం వినోదానికి మాత్రమే అనుకుంటే పొరబాటే. ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందిన యాప్‌ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసులు సైతం ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు.

ఇక మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి... సామాజిక స్పృహను మేలుకొల్పేలా తక్కువ నిడివి గల సందేశాత్మక వీడియోలు రూపొందించి సామాజిక సేవలో భాగస్వాములవుతున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. మ్యాన్‌హోల్‌ తెరచి ఉండటం గమనించిన ఓ వ్యక్తి దానిని మూసి వేయకుండానే దాటుకుని వెళ్లిపోతాడు. ఈ క్రమంలో ఓ గర్భిణి ఫోన్‌లో నిమగ్నమై.. మ్యాన్‌హోల్‌ చూసుకోకుండానే ముందుకు నడుస్తుంటుంది. అక్కడికి దగ్గరగా తన యజమానితో కూర్చుని ఉన్న ఓ కుక్క ఇదంతా గమనిస్తూ ఉంటుంది. వెంటనే పరిగెత్తుకువచ్చి గుంతకు అడ్డంగా పడుకుని.. సదరు మహిళను ప్రమాదం నుంచి కాపాడుతుంది. అయితే కుక్కను ముద్దు చేసిన మహిళ సైతం మ్యాన్‌హోల్‌పై మూత బిగించే ప్రయత్నం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో తన యజమానిని తీసుకువచ్చి ఆమెను మూత పెట్టాల్సిందిగా సూచిస్తుంది కుక్క. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఫోన్‌ మాయలో పడి మనుషులు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న తీరు, అధికారుల నిర్లక్ష్యం, సామాజిక సమస్యలను పట్టించుకోని వైనం ఇలా వివిధ అంశాలను స్పృశించిన ఈ వీడియోపై భాషా, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు