వెలివేతతో ఇస్లామిక్‌ తీవ్రవాదానికి ఊతం

7 Jan, 2019 10:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌: ఇస్లామిక్‌ తీవ్రవాదం పేట్రేగిపోవడానికి సామాజిక బహిష్కరణ లేదా వెలివేత కూడా ఓ కీలక కారణమని తాజా అధ్యయనంలో తేలింది. మెడికల్‌ సైన్స్, న్యూరోఇమేజింగ్‌ పద్ధతుల ద్వారా తీవ్రవాదానికి ఆకర్షితులైన వ్యక్తులను విశ్లేషించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న నఫీస్‌ హమీద్‌ మాట్లాడుతూ..‘ సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు తీవ్రవాదంవైపు మొగ్గుచూపే ఆలోచనలు పెరుగుతున్నాయని గుర్తించాం. 2017లో స్పెయిన్‌లోని లాస్‌ రమ్‌బ్లాస్‌ జిల్లాలో జరిగిన ఇస్లామిక్‌ స్టేట్‌ దాడిలో 13 మంది చనిపోగా దాదాపు 100 మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో 535 మంది ముస్లిం వ్యక్తులను పరిశోధనకు ఎంపిక చేసుకున్నాం. ముగ్గురు సభ్యులు ఆడే వర్చువల్‌ గేమ్‌ ‘సైబర్‌ బాల్‌’లో వీరిని భాగస్వాములు చేశాం. ఆ ఆటలో ఇద్దరు స్పెయిన్‌ పౌరుల ముఖకవళికలతో ఉన్న ఆటగాళ్లు వీరిని నిర్లక్ష్యం చేసేలా చేసి వారి మెదళ్లను స్కాన్‌ చేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించాం. ఇందులో పాల్గొన్న వ్యక్తులు పాఠశాలల్లో ఇస్లామిక్‌ బోధన, మసీదులు కట్టడం వంటి విషయాలు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో 38 మంది మొరాక్‌ సంతతి వ్యక్తులు హింసను ప్రేరేపించేందుకు అంగీకరించారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు