చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు!

19 Jun, 2020 20:41 IST|Sakshi

చైనా తీరును నిరసిస్తున్న నెటిజన్లు‌

హాంకాంగ్‌: చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ హాంకాంగ్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్‌ ఏకపక్ష నిర్ణయాలు, ఒకే దేశం- ఒకే పాలసీ విధానాన్ని ఎండగడుతూ సోషల్‌ మీడియాలో #JunkOneChina హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమాన్ని చేపట్టారు. అదే విధంగా మైనార్టీలపై అకృత్యాలు, అణచివేతకు పాల్పడుతున్న చైనా తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఇప్పుడూ.. ఎప్పుడూ ఒకే చైనా లేదు. ఉండబోదు కూడా. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. జిన్‌జియాంగ్‌లో నివసించే ఉగర్‌ ముస్లింలు, టిబెటన్లు, తైవాన్‌ ప్రజలు, మంచూరియన్లు, హాంకాంగ్‌ వాసులను జిన్‌పింగ్‌ నేతృత్వంలో చైనా ప్రభుత్వం అణచివేస్తోంది. పశ్చిమ దేశాలు డ్రాగన్‌, దాని నియంత షీను పొగడటం మానేయాలి! ఒకే చైనా అనేది ఓ అభూతకల్పన. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా చైనా ఆగడాలపై మౌనం వీడాలి’’అంటూ ట్విటర్‌ వేదికగా అభ్యర్థిస్తున్నారు.(చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు)

(చైనాకు ల‌డ‌ఖ్ ఒక వేలు మాత్ర‌మే)

చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు..
ఇ‍క గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత జవాన్లపై ఘాతుకానికి తెగబడిన చైనాపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డ్రాగన్‌ దుశ్చర్యకు నిరసనగా.. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పిలుపునిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విష్ణు అవతారమైన రాముడు.. చైనా డ్రాగన్‌పై బాణం సంధిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను హాంకాంగ్‌ నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ధన్యవాదాలు చెబుతున్న భారత నెటిజన్లు.. #JunkOneChina హ్యాష్‌ట్యాగ్‌ను ప్రమోట్‌ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టిబెటన్లు సైతం వీరికి తోడయ్యారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!)

‘‘ప్రపంచానికి చైనా పెద్ద తలనొప్పిగా మారింది. చైనా ఒకే దేశం- ఒకే వ్యవస్థ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలి! చైనా కబంధ హస్తాల నుంచి టిబెట్‌ స్వాతంత్ర్యం పొందేలా చేయాలి. చైనా ఉత్పత్తులను అందరూ బహిష్కరించాలి’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఉగర్లపై డ్రాగన్‌ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని బూచిగా చూపిస్తూ ఇప్పటికే వేలాది మందిని అనధికారికంగా నిర్బంధ క్యాంపులకు తరలించింది. ఇక స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన తైవాన్‌ సరిహద్దుల్లో సైతం చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అదే విధంగా హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని కాలరాసేలా ఇటీవల జాతీయ భద్రతా చట్టానికి డ్రాగన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది.(డ్రాగన్‌ దూకుడు.. తైవాన్‌ హెచ్చరికలు!)

   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు