తప్పు సోషల్ మీడియాది కాదు.. మీది

5 Nov, 2015 16:17 IST|Sakshi
తప్పు సోషల్ మీడియాది కాదు.. మీది

సోషల్ మీడియా ఓ పెద్ద అబద్ధపు ప్రపంచం, అందులో సహజత్వం లేదంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ నుంచి బయటకొచ్చిన ఆస్ట్రేలియా మోడల్ ఎస్సేనా ఓ నైల్‌ను యూట్యూబ్ మాజీ స్టార్, నగరంలోని 'రైజ్ 9' సోషల్ మీడియా సీఈవో జ్యాక్ జేమ్స్ తీవ్రంగా విమర్శించారు.

''నైల్‌దే తప్పు. సోషల్ మీడియా ఎప్పటికీ అబద్ధం కాబోదు. యూజర్ అభిమతానికి తగ్గట్టుగానే సోషల్ మీడియా ఉంటుంది. అబద్ధపు జీవితంలోకి మీరే అడుగుపెట్టారు. మీ జీవితపు వైఫల్యాల నెపాన్ని మీడియాపైకి నెడుతున్నారు. మీరు సంతోషంగా లేకపోవడానికి కారణం మీరే. అసలు మిమ్మల్ని మేరే అర్థం చేసుకోలేకపోయారు. మీ ఆవేశకావేషాలకు మీరే బాధ్యులు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలపైకి నెపాన్ని నెట్టడం మంచిదికాదు. చివరకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి బయటకొచ్చి మంచి నిర్ణయమే తీసుకున్నారు'' అని జేమ్స్ తన ఫేస్‌బుక్ పేజీలో వ్యాఖ్యానించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 5,70,000 మంది ఫాలోవర్లను వదిలేసి నైల్ ఇటీవల బయటకు వచ్చిన విషయం తెల్సిందే. ఒక అబద్ధపు ప్రపంచంలో తాను ప్రముఖ మోడల్‌గా ఎదిగానని, సోషల్ మీడియాలో కొట్టుకుపోయి టీనేజీని వృధా చేసుకున్నానని, ఇప్పుడంతా శూన్యంగా కనిపిస్తోందని, అందుకే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మూసేశానని ఓ అన్‌లైన్ వీడియోలో 19 ఏళ్ల నైల్ కన్నీళ్ల పర్యంతంగా చెప్పుకున్న విషయం తెల్సిందే. యూట్యూబ్ యూజర్లను విసుక్కొని 2013లో కోపంతో యూట్యూబ్ నుంచి తన వీడియాలను తొలగించిన జ్యాక్ జేమ్స్ ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించడం కొత్తగా ఉంది.

మరిన్ని వార్తలు