సోషల్‌ ‘ఫేస్‌’ వాష్‌

15 Apr, 2018 01:54 IST|Sakshi

తప్పుల దారిలో సామాజిక మాధ్యమం

బంధుమిత్రులతోపాటు ఇంకో నలుగురితో ముచ్చట్లు పంచుకునేందుకు పనికొస్తుందనుకున్న ఫేస్‌బుక్‌.. ఏకు మేకైన చందంగా మారిపోయింది. తప్పుడు వార్తలు.. మార్కెటింగ్‌ జిమ్మిక్కులు, కుట్రలు, కుతంత్రాలకు వేదికై పోయింది. అయినా సరే.. జనమంతా ఓకే అనుకునేవారేమోగానీ.. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిన నేపథ్యంలో.. దేశాల ప్రభుత్వాలను మార్చేసే శక్తిసామర్థ్యాలను అందిపుచ్చుకునే తరుణంలో ఫేస్‌బుక్‌పై సమీక్ష మొదలైంది.ఇది నియంత్రణకు దారితీస్తుందా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి..!


ఫేస్‌బుక్‌కు ఏం తెలుసు..?
♦  అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యేందుకు పేరు, ఊరు, విద్యార్హతలు మొదలుకుని అనేక విషయాలు ఇస్తాం కదా.. వాటన్నింటినీ ఫేస్‌బుక్‌ తన ప్రయోజనాలకు వాడుకోదన్న గ్యారెంటీ ఏమీ లేదు.
♦ ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వెబ్‌సైట్లు చూసింది.. ఎవరికి మెయిల్‌ పంపింది.. కంపెనీకి ఇట్టే తెలిసిపోతుంటాయి.
♦  ఫ్రెండ్‌ పంపిన పోస్టును లైక్‌ కొడితే చాలు.. మీ లొకేషన్‌తోపాటు కొన్ని ఇతర విషయాలను ఫేస్‌బుక్‌ గుర్తిస్తుంది.
♦  వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, మెసెంజర్‌లు కూడా ఫేస్‌బుక్‌కు సంబంధించిన కంపెనీలే. వీటన్నింటిలో మనం నడిపే వ్యవహారాలన్నింటి సమాచారం ఫేస్‌బుక్‌కు అందుబాటులో ఉన్నట్లే.
♦  ఫేస్‌బుక్‌ అనే కాదు. ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్ల ద్వారా, గూగుల్‌ తన బ్రౌజర్‌ ద్వారా వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తుంటాయి.

వలలో పడకుండా ఉండాలంటే..
♦  ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అయ్యేటప్పుడు కింద ఒక చిన్న బటన్‌ ఉంటుంది. ‘కీప్‌ మీ లాగ్‌డ్‌ ఇన్‌’ అన్న దానిపై క్లిక్‌ చేయవద్దు.
♦  పాస్‌వర్డ్‌ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి.
♦  ప్రొఫైల్‌ను ఎవరు చూడవచ్చో నియంత్రించేందుకు ఉన్న సౌకర్యాన్ని వాడుకోండి.
♦  ఏ రకమైన సమాచారం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. మిగిలినవి తెరపై కనిపించకుండా చేసుకోవచ్చు.
♦  మీ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను అనుసంధానించుకోండి. పాస్‌వర్డ్‌లు మరచిపోతే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నేరుగా వాటిని అందుకునేందుకు అవకాశం ఉంటుంది.
♦  అత్యవసరమైతే మినహా వ్యక్తిగత వివరాలను పోస్ట్‌ చేయడంపై నియంత్రణ అవసరం.
♦  వెబ్‌ బ్రౌజింగ్‌ సమయంలో సెక్యూర్‌ బ్రౌజింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి.  

భూ మ్మీద చెడు అన్నది అసలే లేదు.. అందరూ అమాయకులే అన్న గట్టి నమ్మకంతో ఫేస్‌బుక్‌ అప్లికేషన్లు అభివృద్ధి చేస్తూంటుందని.. ప్రైవసీకి సంబంధించిన విధానాల విషయంలోనూ ఇదే ధోరణి అవలంబిస్తూంటుందని కొందరు ఐటీ నిపుణులు అంటూ ఉంటారు. వ్యక్తిగత సమాచారం విషయంలో జాగ్రత్త తీసుకోమని వచ్చిన విజ్ఞప్తులనూ పెడచెవిన పెట్టడం.. ‘‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’’అన్నట్లుగా వ్యవహరించడం ఫేస్‌బుక్‌కు అలవాటుగా మారిపోయింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా తరహా ఉదంతంతో గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పుడే ‘‘అయ్యో.. తప్పు జరిగిపోయింది. పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నాం’’ అనే సమాధానాలు వస్తూంటాయి.

తెలిసి చేసిందో.. లేదో తెలియదుగానీ.. అప్లికేషన్లను అభివృద్ధి చేసే వారి కోసం సిద్ధం చేసిన ఏపీఐ(అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్ఫేస్‌) కాస్తా.. పడకూడని వారి చేతుల్లో పడింది. మన పరిచయస్తులకు ఉద్యోగ ఖాళీల వివరాలు అందించేందుకు ఉద్దేశించిన ఈ ఏపీఐతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంతోపాటు, సమూహాల ఉమ్మడి అలవాట్లను అర్థం చేసుకునేందుకూ ఉపయోగ పడింది. ఈ ధోరణి కాస్తా అమెరికాలో ట్రంప్‌ గెలుపునకు, బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ లీవ్‌ ప్రచారానికి సాయపడింది. ఈ ఏపీఐ సాయంతో కేంబ్రిడ్జ్‌ అనలిటికా దాదాపు 2.70 లక్షల మంది అప్లికేషన్‌ వినియోగదారులతోపాటు వారి ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్న ఐదు కోట్ల మంది వివరాలను సేకరించగలిగింది.

వారి వ్యక్తిగత అలవాట్లు, ప్రాథమ్యాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన తర్వాత వారి అభిప్రాయాలను మార్చడమే లక్ష్యంగా సమాచారం పంపడం మొదలుపెట్టింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. కేంబ్రిడ్జ్‌ అనలిటికా వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగ పరుస్తోందని ఫేస్‌బుక్‌కు 2016 నుంచే తెలుసు. కానీ ఆ సంస్థకు ఓ లీగల్‌ నోటీస్‌ పంపేసి చేతులు దులిపేసుకుంది. న్యూయార్క్‌ టైమ్స్, గార్డియన్‌ వంటి అంతర్జాతీయ పత్రికలు ఈ అంశంపై ప్రత్యేక కథనాలు సిద్ధం చేస్తున్న తరుణంలో మాత్రమే జరిగిన తప్పును అంగీకరించేందు కు మార్క్‌ జుకర్‌బర్గ్‌ సిద్ధమయ్యాడు! అందుకేనేమో.. ఈ ఏడాది మొదట్లో జుకర్‌బర్గ్‌ ఒక బహిరంగ లేఖ రాస్తూ.. ఫేస్‌బుక్‌లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. వాటి ని సరిదిద్దేందుకు కృషి చేస్తానని తన సంకల్పంగా చెప్పుకున్నాడు.


తడబడుతూ.. తప్పటడుగులు వేస్తూ..
మీరు రోజూ గంటల తరబడి ఫేస్‌బుక్‌ను బ్రౌజ్‌ చేస్తున్నా వినపడని పేరు ఒకటి ఉంది. బీకన్‌ అని! 2007లో దీన్ని ప్రవేశపెట్టారు. మనం ఏయే వెబ్‌సైట్లు చూశామన్న వివరాలు ఫేస్‌బుక్‌ తన భాగస్వాములకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది ఇది. మీ అలవాట్లను ఆధారంగా చేసుకుని న్యూస్‌ఫీడ్‌లో అందుకు తగ్గ పోస్టులు వస్తూంటాయి.

ఈ ఫీచర్‌ కావాలా? వద్దా? అన్నది తేల్చుకునే సౌకర్యం మనకే ఉంటుంది కానీ చాలామంది దీన్ని పట్టించుకోరు. అయితే కొంతమంది వ్యక్తిగత విషయాలూ బయటకు పొక్కిపోవడం, వైవాహిక జీవితాల్లో స్పర్ధలు రావడంతో ఈ ఫీచర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పరిహారం కోరుతూ కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. చివరకు జుకర్‌బర్గ్‌ స్వయంగా తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంటూ బీకన్‌ వాడకాన్ని నిలిపివేశారు.ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌ సెట్టింగ్స్‌లో ‘రెలవెంట్‌ కంటెంట్‌’అని ఓ ఫీచర్‌ ఉంటుంది.

మన ఇష్టాలకు తగ్గట్టుగా, మన మిత్రులు పోస్ట్‌ చేసిన అంశాలను చూసేందుకు, ఆసక్తికరమైన సమాచారం ఫీడ్‌లో ముందుగా చూసేందుకు పనికొస్తుంది ఇది. మనం కొట్టే లైకులు, క్లిక్‌ చేసిన, షేర్‌ చేసిన పోస్టులు, చూసిన వీడియోల ఆధారంగా ఏ పోస్టు ముందు ప్రత్యక్షం కావాలో నిర్ణయించేందుకు ఎంగేజ్‌మెంట్‌ ర్యాంకింగ్‌ పేరుతో ఒక అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. తొలినాళ్లలో అంతా బాగానే ఉన్నా.. కొంతమంది ఈ ఫీచర్‌ సాయంతో ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేయడం మొదలు పెట్టడంతో సమస్య మొదలైంది. మొదట్లో ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకపోయినా సమస్య ఒకటుందని జుకర్‌బర్గ్‌ ఒప్పుకోక తప్పింది కాదు.


ముందే స్పందించి ఉంటే..
ఫేస్‌బుక్‌ తప్పుల తడక ప్రయాణంలో ఇవి మచ్చుకు కొన్నే. 2009లో గేమ్స్‌కు సంబంధించిన యాప్‌ ప్లాట్‌ఫార్మ్‌ను మొదలుపెట్టినప్పుడు అనూహ్యంగా పెడదారి పట్టింది. క్యాండీ క్రష్‌ సోడా ఆడమంటూ వచ్చిన వందల నోటిఫికేషన్లే దీనికి ఉదాహరణ. చివరకు కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రైవసీ విధానంలో తరచూ మార్పులు చేయడం, వినియోగదారులపై పరిశోధనలకు బయటివారికి.. సొంత ఉద్యోగులకూ అనుమతులివ్వడం కూడా విమర్శలకు కారణమైంది.

జాతుల ఆధారంగా ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం కల్పించడం, నకిలీ అకౌంట్లు పెరిగిపోయేందుకు అవకాశం కల్పించడం, ఫ్రీబేసిక్స్‌ పేరుతో ఇంటర్నెట్‌పై పరోక్షంగా ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించడం వంటి అనేకానేక అంశాలు ఫేస్‌బుక్‌ ప్రతిష్టను క్రమేపీ మసకబార్చాయి. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదని, కేంబ్రిడ్జ్‌ అనలిటికా వంటి సంస్థలు ప్రభుత్వాల ఎంపికపైనా ప్రభావితం చూపేంత స్థాయికి ఎదిగేవి కావని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తలు