భూమిపై సౌర తుపాను ప్రళయం..!

13 Mar, 2018 19:23 IST|Sakshi
సౌర తుపాను (ఫైల్ ఫొటో)

సౌర తుపాను రాకను గుర్తించిన నాసా

జీ1 హెచ్చరికను జారీ చేసిన జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ

వాషింగ్టన్‌ : భారీ సౌర తుపాను బుధవారం భూమిని తాకనున్నట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ(ఎన్‌ఓఏఏ) పేర్కొంది. ఈ మేరకు జీ1 హెచ్చరికను జారీ చేసింది. సౌర తుపాను ధాటికి ఉపగ్రహాలు, విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావొచ్చని హెచ్చరించింది. భారీ స్థాయిలో శక్తివంతమైన కణాలు, భూమిని ఢీ కొట్టడం వల్ల విద్యుత్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది.

దీంతో ఉత్తర ధ్రువం నుంచి భారీ ఎత్తున వెలుగు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని వివరించింది. సూర్యుడిపై గల వాతావరణంలో గత వారం భారీ పేలుడు సంభవించినట్లు తెలిపింది. ఈ ఘటనలో వెలువడిన కోట్లాది శక్తిమంతమైన కణాలు అతి వేగంగా భూమి వైపునకు దూసుకొస్తున్నాయి.

ఇదే సమయంలో భూమి అయస్కాంత ఆవరణలో ‘ఈక్వినాక్స్‌ క్రాక్స్‌’  ఏర్పడుతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది మార్చి 20, సెప్టెంబర్‌ 23 తేదీల్లో భూమి అయస్కాంత ఆవరణంలో ఈక్వినాక్స్‌ క్రాక్స్‌ ఏర్పడతాయి. ఈ సమయంలో విశ్వం నుంచి కణాలను భూమి తట్టుకోగలిగే సహజ శక్తి కొద్దిగా తగ్గుతుంది.

దీంతో భూమి ఆవరణంలో ఉన్న జీపీఎస్‌ వ్యవస్థలు, ఆకాశంలో ఎగురుతున్న విమానాలు సౌర తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్నస్థాయిలో జియో సౌర తుపాను ఈ నెల 14, 15 తేదీల్లో సౌర తుపాను భూమిని తాకొచ్చని చెప్పింది. ధ్రువాల వద్ద సంభవించే వెలుగులు మాత్రం స్కాట్‌లాండ్‌, ఉత్తర ఇంగ్లండ్‌, అమెరికాలోని మిచిగాన్‌, మైన్‌ ప్రాంతాల్లో కనిపిస్తాయని తెలిపింది.

మరిన్ని వార్తలు