అప్పట్లోనే ‘కరోనా’ను ఊహించారా?

4 Mar, 2020 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుందని కొందరు ముందే ఊహించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా అమెరికా రచయిత్రి సిల్వియా బ్రౌన్‌ 12 ఏళ్ల కిందటే(2008లో) తను రాసిన ‘ఎండ్‌ ఆఫ్‌ డేస్‌’ బుక్‌లో కరోనా వైరస్‌ గురించి ప్రస్తావించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ బుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘2020 సమయంలో.. న్యుమోనియాను పోలిన ఒక జబ్బు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసనాళాలపై ఇది ప్రభావం చూపుతోంది. దీనికి చికిత్స కష్టంగా మారుతుంది.

అయితే అది ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా మాయమవుతుంది. ఈ జబ్బు పదేళ్ల తర్వాత మళ్లీ విజృంభించి.. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగు అయిపోతుంద’ని సిల్వియా ఈ బుక్‌లో పేర్కొన్నారు. అయితే బుక్‌లో పేర్కొన్న విధంగానే కరోనా వైరస్‌ లక్షణాలు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల కిందటే కరోనా గురించి ఎలా ఊహించారని షాక్‌కు గురవుతున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. దీనిని చూసినప్పుడు ఆశ్చర్యం వేసినప్పటికీ కొద్దిగా ఉపశమనం కూడా కలిగిందని పేర్కొన్నారు. (చదవండి : మైండ్‌ స్పేస్‌ ఖాళీ కాలేదు : సజ్జనార్‌)

కొద్ది రోజుల కిందట కూడా కరోనాకు సంబంధించి కొన్ని కథనాలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. ’ అనే పద్యంలో చెప్పింది కరోనా గురించేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే డీన్‌ కూన్జ్‌ అనే రచయిత 40 ఏళ్ల కిందటే ‘ది ఐస్‌ ఆఫ్‌ డార్క్‌’ అనే నవలలో ఓ వైరస్‌కు వుహాన్‌ 400 అనే పేరు పెట్టాడు. వుహాన్‌ నగరం వెలుపల ఓ ల్యాబ్‌లో దీన్ని తయారుచేస్తారని.. ఇది మనుషులపై మాత్రమే తన ప్రభావాన్ని చూపుతుందని డీన్‌ ఆ నవలలో పేర్కొన్నాడు. ఇప్పుడు కరోనా ఉనికి కూడా వుహాన్‌ నగరంలోనే కేంద్రీకృతం కావడంతో డీన్‌ నవల నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.(చదవండి : 'తెలంగాణలో కరోనా కేసు నమోదు కాలేదు')

మరిన్ని వార్తలు