సౌదీకి ఖషోగ్గీ కుమారుల వినతి

6 Nov, 2018 10:24 IST|Sakshi

వాషింగ్టన్‌: టర్కీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో దారుణ హత్యకు గురైన వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గీ మృతదేహాన్నైనా తమకు ఇవ్వాలని ఆయన కుమారులు సౌదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం భౌతిక కాయాన్నైనా తమకు ఇస్తే పవిత్ర మదీనాలోని స్మశానవాటికలో ఖననం చేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న టర్కీలోని సౌదీ ఎంబసీలోకి వెళ్లిన ఖషోగ్గీ అప్పటినుంచి అదృశ్యం కావడం, సౌదీ యువరాజుపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు ఆయనను సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఎంబసీలోనే దారణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

ఖషోగ్గీ మృతదేహాన్ని ముక్కలుగా చేసి, యాసిడ్‌ లో కరిగించారని ఇటీవల టర్కీ అధికారులను ఉటంకిస్తూ ఒక వార్తాకథనం కూడా వెలువడింది. నెల రోజులకు పైగా అత్యంత వేదనను అనుభవిస్తున్నామని, ఇప్పటికైనా తమ తండ్రి మృతదేహాన్ని ఇవ్వాలని సౌదీ అధికారులను కోరామని ఖషోగ్గీ కుమారులు సలా ఖషోగ్గీ, అబ్దుల్లా ఖషోగ్గీ సోమవారం మీడియాకు తెలిపారు. తమ తండ్రి దేశద్రోహి కాదని, ఆయనకు సౌదీ రాచరిక వ్యవస్థపై నమ్మకం ఉండేదని, అదే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని భావించేవాడని సలా వివరించారు. దోషులందరికీ శిక్ష పడుతుందన్న సౌదీ రాజు హామీని తాము విశ్వసిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు