ఇక బట్టలు ఉతకక్కర్లేదట!

24 Mar, 2016 14:02 IST|Sakshi
ఇక బట్టలు ఉతకక్కర్లేదట!

మురికి పట్టిన బట్టలు ఉతికి ఉతికి అలసిపోయారా? ఈ మరక పోయేదెలా అని బెంగపడుతున్నారా?  ఇక ఆ అలసటకు, బెంగలకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చని అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. భారతీయ సంతతికి చెందిన పరిశోధకుడు రాజేష్ రామనాథన్, దిపేష్ కుమార్, విపుల్ బన్సల్ సహా పరిశోధక బృందం ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికింది. అతి తక్కువ ఖర్చుతో, అతి సునాయసంగా దుస్తులు శుభ్రం చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు. వాటంతట అవే శుభ్రం అయ్యే దుస్తులు తొందర్లోనే వచ్చేస్తున్నాయ్!

కేవలం  కొన్నినిమిషాల పాటు సూర్యకాంతి, లేదా బల్బ్ కాంతి కింద ఉంచడం ద్వారా వస్త్రాలు శుభ్రమయ్యే పద్ధతిని కనుగొన్నామని చెప్పారు. నానో స్ట్రక్చర్లు ఉన్న దుస్తులను కాంతికింద ఉంచినపుడు, అందులోని సేంద్రియ పదార్థాలు క్షీణిస్తాయని, ఫలితంగా కొన్ని నిమిషాల్లోనే బట్టలు వాటికవే శుభ్రపడతాయన్నారు. 


తమ పరిశోధనలో భాగంగా కాంతికి ఆకర్షించే వెండి, రాగికి సంబంధించిన నానో స్ట్రక్చర్లను పరిశీలించినట్టు చెప్పారు. తాము రూపొందించిన  టెక్నాలజీ ప్రకారం కాంతిని స్వీకరించిన నానో స్ట్రక్చర్లు హాట్ ఎలక్ట్రాన్లను క్రియేట్ చేస్తాయి. తద్వారా మరింత శక్తి జనించి, సేంద్రియ పదార్థాన్ని కీణింపజేస్తాయి. దీంతో ఆరు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే వాటంతట అవే బట్టలు శుభ్రమవుతాయని పరిశోధనలో తేలిందన్నారు. తమ ఈ పరిశోధన నానో ఎన్హాన్స్డ్ వస్త్రాల తయారీకి మార్గం సుగమం చేస్తుందన్నారు. 

దీన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నామని, పారిశ్రామిక స్థాయిలో ఈ టెక్నాలజీని విస్తరింపచేస్తే భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని వారు తెలిపారు. టమాటా సాస్, వైన్  లాంటి వాటివల్ల ఏర్పడే మరకల్ని కూడా సాధ్యమైనంత త్వరగా శుభ్రం చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని, అది ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. తమ పరిశోధన పత్రం 'అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ ఇంటర్ ఫేసెస్ ' అనే జర్నల్ లో  పబ్లిష్ అయిందని  తెలిపారు.

మరిన్ని వార్తలు