నాట్‌ జస్ట్‌ మిసెస్‌ ట్రూడో

20 Feb, 2018 00:31 IST|Sakshi
భర్త జస్టిన్‌ ట్రూడోతో సోఫీ గ్రెగ్వాతో (ఫైల్‌ ఫొటో)

‘‘కాబట్టి డియర్‌.. ఒక నాయకుడిగా నువ్వు ప్రజల కష్టాలు తొలగించాలంటే శాంత చిత్తంతో సుస్థిర నిర్ణయాలు తీసుకోవాలి. అదెలా అలవడుతుందో తెలుసా? ఒకటి నా పాటతో, రెండు యోగా సాధనతో..’’ అంటూ గట్టిగా నవ్వేస్తారు సోఫీ గ్రెగ్వా ట్రూడో. ఇదేదో ప్రైవేటు సంభాషణ కాదు.. వందల మంది అతిథులు, పదుల సంఖ్యలో మీడియా కెమెరాల సాక్షిగా ఇచ్చిన సలహా. ‘యెస్‌ మై లవ్‌.. ఏనాడైనా నీ మాట కాదన్నానా.. అసలు నువ్వే లేకుంటే నేను ప్రధానమంత్రిని అయ్యేవాడినా’ అని శిరస్సు వంచుతారు జస్టిన్‌ ట్రూడో! ప్రస్తుతం ఆ జంట తొలిసారి మన దేశంలో పర్యటిస్తున్నారు.

ప్రపంచంలోనే వైశాల్యంలో రెండో అతిపెద్ద దేశం కెనడాకు 2015లో యువ(43ఏళ్ల వయసులో) ప్రధానిగా ఎన్నికయ్యారు జస్టిన్‌ ట్రూడో. శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన కెనడాను ఆయన పరిపాలిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాల్లోని భిన్నత చాలాసార్లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ట్రంప్‌ వచ్చిన తర్వాత వలసదారుల్ని అమెరికా గెంటేస్తే.. వారిని కెనడాకు రమ్మని ఆహ్వానం పలకడంగానీ, పాక్‌ సాహసబాలిక మలాలకు కెనడా పౌరసత్వమిచ్చి సత్కరించడంగానీ, ఎప్పుడో 1914లో హిందూ, సిక్కు, ముస్లింలు ఉన్న ఓడను కెనడా వెనక్కి పంపిన ఘటనకు.. 2016లో జస్టిన్ ట్రూడో క్షమాపణలు చెప్పడం, మొన్నటి పొంగల్‌ వేడుకల్లో సౌత్‌ ఇండియన్‌ స్టైల్లో పంచె కట్టడంగానీ, నిన్నటికినిన్న తొలిసారి భారతావనిపై అడుగుపెట్టినప్పుడు కుటుంబమంతా చేతులు జోడించి నమస్కరించిన తీరుగానీ.. ట్రూడో శాంతచిత్తాన్ని, భార్య సూచనల్ని ఆచరిస్తున్నాడన్న వాస్తవాన్ని తెలియపరుస్తాయి. యోగాసాధనతో తను తాను నూతనంగా మలుచుకున్న సోఫీ గ్రెగ్వా ట్రూడో.. జర్నలిస్టుగా, సేవాకార్యక్రమాల నిర్వాహకురాలిగా, మహిళలు, బాలికల సాధికారతకోసం శ్రమిస్తోన్న ధీరగా ఇప్పటికే పేరు సంపాదించారు. అందుకే అభిమానులు ఆమెను ‘ఫస్ట్‌ లేడీ’ అనడంకన్నా ‘నాట్‌ జస్ట్‌ మిసెస్‌ ట్రూడో’ అని గౌరవించుకుంటారు.

ఇండియాలో ఆమెకంటూ ప్రత్యేక షెడ్యూల్‌ : కెనడా కేంద్రంగా మహిళా సాధికారత కోసం పనిచేస్తోన్న పలు స్వచ్ఛంద సంస్థల్లో సోఫీ ట్రూడో వాలంటీర్‌గా కొనసాగుతున్నారు. ఆ లాభాపేక్షరహిత సంస్థలన్నీ.. బాలికా విద్య, మహిళలు, గర్భిణుల ఆరోగ్యం, కేన్సర్‌ నివారణ, మానసిక రుగ్మతల నిర్మూలన, గృహ హింసకు వ్యతిరేక, తదితర లక్ష్యాలతో పనిచేస్తున్నాయి. సేవా కార్యక్రమాలకు నిధులు సేకరించడం దగ్గర్నుంచి క్షేత్రస్థాయి పనుల దాకా అన్నీ తానై వ్యవహరిస్తుందామె. ‘బికాజ్‌ ఐయామ్‌ ఎ గర్ల్’‌, ‘ది షీల్డ్‌ ఆఫ్‌ ఎథీనా’, ‘వాటర్‌క్యాన్‌’ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సేవా సంస్థలకు సోఫీ అంబాసిడర్‌ కూడా.

ఢిల్లీ విమానం ఎక్కేముందు..‘‘నమస్తే, మేం ఇండియాకి వెళుతున్నాం.. ఇరుదేశాల(కెనడా-భారత్‌) మధ్య సంబంధాలు బలపడటం ఒక ఎత్తైతే, భారత మహిళలు, బాలికల సాధికారత గురించి తెలుసుకుని, వారితో నేరుగా మాట్లాడబోవడం గొప్ప విషయంగా భావిస్తున్నా’’ అని సోఫీ తన ఫేస్‌బుక్‌లో రాసుకున్నారు. ఏడురోజుల భారత పర్యటనలో భర్త వెన్నంటే కాకుండా తనకంటూ ప్రత్యేక షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారామె. ముంబైలోని సోఫియా కాలేజీలో విద్యార్థినులతో భేటీ, మహిళల, బాలికల సాధికారత కోసం పనిచేస్తోన్న ఎన్జీవోలను కలుసుకోవడం, ఢిల్లీలో ‘న్యూట్రిషన్‌ ఇంటర్నేషనల్‌’ ఎన్జీవో కార్యాలయాన్ని సందర్శించడం తదితర కార్యక్రమాల్లో సోఫీ పాల్గొంటారు.

చిన్ననాటి స్నేహితులు.. ప్రేమికులయ్యారు..

లిబరల్‌ పార్టీ ఆఫ్‌ కెనడా రెండోతరం నాయకుడు, ఆ దేశానికి 15 ఏళ్లపాటు ప్రధానిగా సేవలందించిన వ్యక్తి జోసెఫ్‌ ఫిలిప్‌ ట్రూడో. ఆయన పెద్దకుమారుడే జస్టిన్‌ ట్రూడో. జస్టిన్‌ తమ్ముడు మిచెల్‌కు సోఫీ క్లాస్‌మేట్‌. అలా చిన్నతనంలోనే జస్టిన్‌-సోఫీలు స్నేహితులయ్యారు. కొంతకాలంపాటు ఎవరి చదువుల్లో వారు బిజీ అయిపోయి మళ్లీ 2003లో ఓ చారిటీ ప్రోగ్రామ్‌లో కలుసుకున్నారు. కొద్దినెలల డేటింగ్‌ తర్వాత 2005లో పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. జేవియర్‌ జేమ్స్‌ ట్రూడో(పెద్దకొడుకు), ఎల్లా గ్రేస్‌ మార్గరేట్‌ ట్రూడో(కూతురు), హాడ్రిన్‌ గ్రెగ్వా ట్రూడో(చిన్నోడు). పెద్దింటి కోడలు అయినప్పటికీ సోఫీ తన ఇంటిపేరును మాత్రం మార్చుకోలేదు. జస్టిన్‌ కూడా ఆమెను ‘గ్రెగ్వా ట్రూడో’గా సంబోధించడానికి ఇష్టపడతారు.  

జీవితాన్ని మార్చేసిన యోగా..

మాంట్రియల్‌కు చెందిన స్టాక్‌బ్రోకర్‌-నర్స్‌ దంపతులకు జన్మించిన సోఫీ.. టీనేజ్‌లో ఉన్నప్పుడు బులిమియా నెర్వోసా (అతిగా ఆహారం తీసుకునే) రుగ్మతకు గురయ్యారు. అది చికిత్స అవసరమైన తీవ్ర స్థాయి రుగ్మత కావడంతో బయటపడేందుకు చాలా కష్టపడాల్సివచ్చింది. కెనడాలోని భారతీయ స్నేహితుల ద్వారా యోగా గురించి తెలుసుకున్న సోఫీ.. క్రమం తప్పకుండా అభ్యసించి పూర్తిగా కోలుకున్నారు. అప్పటినుంచి యోగా ఆమె జీవితంలో ముఖ్య భాగమైపోయింది. 2012నాటికి గుర్తింపు పొందిన యోగా శిక్షకురాలయ్యారు. తాను పాల్గొనే ప్రతి కార్యక్రమంలో యోగా విశిష్టతను గుర్తుచేస్తూ ఉంటారామె.

జర్నలిస్టుగా ఖ్యాతి :

మాంట్రియల్‌ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌ డిగ్రీ పట్టాసాధించిన సోఫీ.. ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీలో రిసెప్షనిస్టుగా కెరీర్‌ ప్రారంభించి మేనేజర్‌ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత రేడియో అండ్‌ టెలీవిజన్‌ స్కూల్లో జర్నలిజం పాఠాలు నేర్చుకుని న్యూస్‌ టిక్కర్లు రాసేపనిలో చేరారు. కళలు, సాంస్కృతిక అంశాలు, సినిమాలపై గట్టి పట్టున్న ఆమెను.. ఎల్‌సీఎన్‌ చానెల్‌వాళ్లు రిపోర్టర్‌గా తీసుకున్నారు. విజయవంతంగా వార్తలు అందించిన ఆమె పలు టీవీ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించారు. ప్రఖ్యాత సీటీవీ చానెల్‌లో ఐదేళ్లు పనిచేసిన సోఫీ.. ‘ఈ టాక్‌’ ప్రోగ్రామ్‌ ద్వారా మరింత పేరు సంపాదించారు. 2016లో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ డే(జనవరి 18) సందర్భంగా ఒట్టావాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సోఫీ.. ఆఖర్లో ఓ పాట పాటి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘స్మైల్‌ బ్యాక్‌ ఎట్‌ మీ’ పేరుతో స్వయంగా కంపోజ్‌ చేసిన ఆ పాటను తన కూతురికోసం రాశానని సోఫీ ప్రకటించారు. ‘ Some people doubt that angels can fly.. Some people fight without knowing why అంటూ మొదలైన పాట.. What's between you and me.. When you smile back at me వాక్యాలతో ముగియగానే స్టాండిగ్ ఓవేషన్ లభించింది.

- సాక్షి వెబ్‌డెస్క్‌

వివిధ సందర్భాల్లో భారత సంతతి సమూహాలతో ట్రూడో..

మరిన్ని వార్తలు