కోల్పోయిన మగతనాన్ని ప్రసాదించారు..

14 Mar, 2015 11:22 IST|Sakshi
కోల్పోయిన మగతనాన్ని ప్రసాదించారు..

వైద్య చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు సౌతాఫ్రికా  వైద్యులు. మొట్టమొదటిసారి పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. ఏడు గంటపాటు నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్ ద్వారా అంగాన్ని కోల్పోయిన 21 ఏళ్ల యువకుడికి తిరిగి దానిని ప్రసాదించగలిగారు.

యూనివర్సిటీ ఆఫ్ స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్ల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కేప్టౌన్లోని టైగర్బర్గ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం మీడియాకు తెలిపారు. మత మార్పిడిలో భాగంగా సున్తీ చేయించుకున్న ఓ యువకుడు (పేరు చెప్పలేదు) కొద్ది రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సున్తీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని పురుషాంగాన్ని తొలిగించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత కేప్టౌన్ వైద్యుల ప్రకటన ఆ యువకుడికి కొత్త ఆశలు రేకెత్తించింది..

అనారోగ్యంతో మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అతని అంగాన్ని సదరు యువకుడికి అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఏ తేదీన ఆపరేషన్ నిర్వహించిందీ వెల్లడించనప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని టైగర్స్ బర్గ్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు ఆండ్రూ వాన్డెర్ మెర్వే చెప్పారు. సున్తీ సమయంలో అజాగ్రత్తల కారణంగా ఆఫ్రికాలో ఏటా వందలమంది యువకులు అంగాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు