భలే కలిశారు!

11 Mar, 2016 15:18 IST|Sakshi
భలే కలిశారు!

కేప్ టౌన్: సినిమా కథను తలపించే ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తల్లి ఒడి నుంచి అదృశ్యమైన బాలిక నాటకీయ పరిస్థితుల్లో తిరిగి సొంతవారిని కలుసుకుంది. మోర్నీ నర్స్, సెలెస్టే నర్స్ దంపతులకు 1997, ఏప్రిల్ లో అమ్మాయి పుట్టింది. సెలెస్టే.. కేప్ టౌన్ ఆస్పత్రిలో ఉండగా తన పొత్తిల్లోని మూడు రోజుల పసిపాపను ఓ మహిళ ఎత్తుకుపోయింది. కన్నబిడ్డను కనబడకపోవడంతో నర్స్ దంపతులు ఎంతో ఆవేదన చెందారు.

కాలం గిర్రున తిరిగింది. నర్స్ దంపతుల రెండో కుమార్తె గతేడాది తన స్కూల్లో మరో విద్యార్థినితో స్నేహం చేసింది. ఆ అమ్మాయి అచ్చం తనలాగే ఉండడంతో ఆశ్చర్యపడిన ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసుల సాయంతో ఆ విద్యార్థినికి డీఎన్ ఏ టెస్టులు చేయించడంతో ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఆమె ఎవరో కాదని చిన్నప్పుడు తప్పిపోయిన తమ మొదటి కుమార్తె జెఫానీ నర్స్ తెలియడంతో వారు ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు.

తమ పాపను తమకు దూరం చేసిన మహిళ(51)ను చట్టం ముందు నిలబెట్టారు. నిందితురాలు మొదట బుకాయించింది. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, ఆమె తన సొంత కుమార్తె అని వాదించింది. 2003లో నకిలీ బర్త సర్టిఫికెట్ తో తన కుమార్తెగా అధికారిక రికార్డుల్లోనమోదు చేయించిందని ప్రాసిక్యూషన్ నిరూపించింది. దీంతో కోర్టు ఆమెను దోషిగా ధ్రువీకరించింది. ఆమెకు పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. మే 30న ఆమెకు శిక్ష ఖరారు చేయనున్నారు. ఊహించని విధంగా తమ మొదటి కుమార్తె 18 ఏళ్ల తర్వాత తిరిగి రావడంతో నర్స్ దంపతులు ఉబ్బితబ్బివుతున్నారు.

>
మరిన్ని వార్తలు