చిచ్చరపిడుగు.. ఆరేళ్లకే అంత ప్రాపర్టీనా?!

29 Jul, 2019 10:18 IST|Sakshi

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎవరు, ఎప్పుడు, ఏవిధంగా, ఎందుకు ఫేమస్‌ అవుతారో ప్రస్తుతం ఊహకందని విషయం. కాస్త ప్రతిభ, తెలివితేటలు ఉంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ... డబ్బు, పేరు ఈజీగా సంపాదించుకోవచ్చు. దక్షిణా కొరియాకు చెందిన ఆరేళ్ల చిన్నారి బోరమ్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తనొక యూట్యూబ్‌ స్టార్‌. బొమ్మలతో ఆడుకుంటూ వాటి రివ్యూలు ఇచ్చే ఈ చిచ్చర పిడుగుకు రెండు యూట్యూబ్‌ చానళ్లు ఉన్నాయి. వాటికి దాదాపు 30 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.

ఇక వీక్షకుల సంఖ్య ఇంతపెద్ద మొత్తంలో ఉందంటే బోరమ్‌ సంపాదన కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అవును ఇప్పుడు తనొక కోటీశ్వరురాలు. తన సంపాదనతో ఏకంగా రాజధాని సియోల్‌లోని గంగ్నమ్‌ సబ్‌అర్బ్‌ ఏరియాలో 5 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసింది ఈ చిట్టితల్లి. దాని ధర 9.5 బిలియన్‌ కొరియన్‌ వన్లు అంటే మన కరెన్సీలో దాదాపు 55 కోట్ల రూపాయలన్నట మాట. ఏంటి ఆరేళ్లకే ఇంత సంపాదనా.. అది కూడా హాయిగా ఆడుకుంటూ అని నోరెళ్లబెడుతున్నారా. అదంతే అంతా సోషల్‌ మీడియా మహిమ. ఏమంటారు?.. అంతేగా అంతేగా!!

మరిన్ని వార్తలు