శత్రుదేశాలు.. ఆసక్తికర దృశ్యాలు!

10 Feb, 2018 20:45 IST|Sakshi
కిమ్ యో జాంగ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ద.కొరియా నేత

సియోల్‌: శీతాకాల ఒలింపిక్స్‌ నేపథ్యంలో శత్రుదేశాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందట నార్త్ కొరియా నియంత ప్రేయసి హోన్ సాంగ్ వోల్ దక్షిణకొరియాకు చేరుకోగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కిమ్ జాంగ్ ఉన్ దిష్టిబొమ్మలు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరి కిమ్ యో జాంగ్, కొందరు ఉత్తర కొరియా ప్రతినిధులతో కలిసి వింటర్ ఒలింపిక్స్‌ నిమిత్తం ద.కొరియాకు వెళ్లగా సాదర స్వాగతం లభించింది. ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ కిమ్ సోదరి కిమ్ యో జాంగ్‌కు, ఉన్నత స్థాయి అధికారులకు శనివారం ప్రత్యేక విందు ఇచ్చారు. 

సియోల్‌లోని అధ్యక్ష భవనంలో మూన్‌ వారితో లంచ్‌ సమయంలో నార్త్ కొరియా ప్రతినిధుల బృందం సమావేశమైంది. సమావేశం అనంతరం ఆతిథ్య ద.కొరియా నేతలు కిమ్ యో జాంగ్‌ సహా ఉ.కొరియా ఒలింపిక్స్ అధికారుల బృందానికి నేతృత్వం వహిస్తున్న కియ్ యాంగ్ నామ్‌కు రుచికరమైన విందు ఇచ్చింది. శత్రుదేశాల మధ్య జరిగిన ఈ విందు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న (శుక్రవారం) ప్యాంగ్‌చాంగ్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో కిమ్ యో జాంగ్, కిమ్‌ యాంగ్‌ నామ్‌లు వీఐపీ గ్యాలరీలో కనిపించారు. అమెరికాతో ఏ విషయాన్ని చర్చించే ప్రసక్తే లేదని కిమ్ జాంగ్ ఉన్ ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో నార్త్ కొరియా, అమెరికా అధికార బృందాలు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించాయి.

మరిన్ని వార్తలు