కరోనా: ఉ. కొరియాలో 700 మంది ఒకేచోట..

21 Mar, 2020 15:45 IST|Sakshi
ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం(ఫొటో: రాయిటర్స్‌)

ప్యాంగ్‌యాంగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19) ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిల్లాడుతుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం ‘నా రూటే సపరేటు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో సైన్యం చిన్న తరహా బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగిస్తుంటే తాపీగా కూర్చుని వాటిని పర్యవేక్షించారు. అంతేకాదు కరోనాను ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని తెలియజేసేందుకు ఏకంగా 700 మంది అధికారులు ఒక్కచోట చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో దాయాది దేశం తీరును దక్షిణ కొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అంటువ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో ఇలా క్షిపణులు పరీక్షించడం అనుచిత చర్య అని మండిపడింది. ఈ మేరకు శనివారం ఉదయం 6.45- 50 నిమిషాల సమయంలో కొరియా ద్వీపంలోని సోన్‌చోన్‌ సమీపంలో ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వెల్లడించారు. ఉత్తర కొరియా సైనిక చర్య గర్హనీయమన్నారు. (కరోనా: ఉత్తర కొరియాలో పేషెంట్‌ కాల్చివేత!)

కాగా తమ దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం లేదని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ శనివారం సమావేశం కానుందని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 700 మంది ఉన్నతాధికారులు అంతా ఒక్కచోట చేరి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారని వెల్లడించింది. ఈ క్రమంలోనే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ క్షిపణుల ప్రయోగానికి సైనిక అధికారులను శుక్రవారం ఆదేశించినట్లు పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా వీక్షించారని.. ఆ సమయంలో మాస్కులు ధరించలేదని వెల్లడించారు.

కాగా చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని సరిహద్దు దేశాలు సహా దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. అంతేకాకుండా... కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఉత్తర కొరియా పాశవికంగా హతమార్చినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. (కరోనా: 11 వేలు దాటిన మృతుల సంఖ్య)

కోవిడ్‌: యువతకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు!

మరిన్ని వార్తలు