కిమ్‌ సోదరి హెచ్చరిక.. తలొగ్గిన దక్షిణ కొరియా!

5 Jun, 2020 16:09 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ బెదిరింపులకు దాయాది దేశం దక్షిణ కొరియా తలొగ్గింది. ఆమె హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా తీరును నిరసించిన కార్తకర్తలపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు డెయిలీ మెయిల్‌ కథనం ప్రచురించింది. గత కొన్ని రోజులుగా కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఎరువు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వదంతులకు తాత్కాలికంగా చెక్‌ పెట్టారు. అయినప్పటికీ కిమ్‌కు శస్త్ర చికిత్స జరిగిందని.. ఆయన మరణించారన్న ఊహాగానాలకు మాత్రం తెరపడలేదు. (మిలిట‌రీ మీటింగ్‌లో కిమ్‌)

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, దాయాది దేశం నుంచి వలస వచ్చిన వారు.. కిమ్‌ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. వాటితో పాటు కిమ్‌ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ ... ‘‘మాతృదేశానికి ద్రోహం చేసిన ఫిరాయింపుదార్లంతా సంకరజాతి కుక్కలు. వారి ప్రేలాపనలకు యజమానులు సమాధానం చెప్సాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ అధికార మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. (నిరసనకారుడిని ఒక్కసారిగా తోసేయడంతో..)

అదే విధంగా కిమ్‌ను విమర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే.. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని దాయాది దేశాన్ని హెచ్చరించారు. అంతేగాకుండా ఉభయ కొరియాల పునర్‌ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్‌ పేర్కొంది. ఆ బెలూన్ల వల్ల అంతా నష్టమే తప్ప ఏ మంచి జరుగలేదంటూ సియోల్‌ అధికారి ఒకరు వాపోయినట్లు తెలిపింది. కాగా కిమ్‌ తర్వాత ఆయన చెల్లెలు కిమ్‌ యో జాంగ్‌ ఉత్తర కొరియాలో కీలక నేతగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. కిమ్‌ మరణించారన్న వదంతుల నేపథ్యంలో ఆయన వారసురాలిగా కిమ్‌ యో జాంగ్‌ పాలనాపగ్గాలు చేపట్టనున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. 

>
మరిన్ని వార్తలు