900మంది గుండ్లు గీయించుకొని పోరాటం

16 Aug, 2016 12:59 IST|Sakshi
900మంది గుండ్లు గీయించుకొని పోరాటం

సియోల్: తమ దేశం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియా ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దాదాపు 900 మంది బహిరంగంగా గుండ్లు చేయించుకొని నిరసన తెలిపారు. తమ భద్రతకు సంబంధించిన ఎలాంటి హామీ ఇవ్వకుండానే అనుచిత నిర్ణయాన్ని తీసుకోవడం తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ వారంతా రోడ్లెక్కారు. అమెరికాతో అణు కార్యక్రమంలో భాగంగా దక్షిణ కొరియా ఆ దేశంతో థాడ్(యూఎస్ టెర్మినల్ హైట్ ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) ఒప్పందం చేసుకుంది.

దీని ప్రకారం సియాంజులో ఓ భారీ యాంటీ మిసైల్ యూనిట్ ను ఏర్పాటుచేయనుంది. దీనికి వ్యతిరేకంగా సియాంజు నగర ప్రజలు తమ దేశ స్వేచ్ఛా దినం రోజే రోడ్లెక్కి ఈ నిరసన తెలిపారు. గత జనవరిలో నాలుగోసారి ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతిసారి ఏదో ఒక అణ్వాయుధాల పరీక్షలు జరుపుతూ తాము అమెరికాలోని ఏ భాగంనైనా.. దక్షిణ కొరియా రాజధానినైనా క్షణాల్లో బుగ్గి చేయగలమంటూ ప్రకటనలు చేస్తూ ప్రతి క్షణం భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అమెరికాతో యాంటి మిసైల్ ప్రోగ్రాంకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి సియాంజు వ్యవసాయానికి అనువైన భూభాగం.

ఇక్కడ ఎంతోమంది రైతులు పలు రకాల పంటలు పండించి దేశంలోని పలు ప్రాంతాల అవసరాలు తీరుస్తున్నారు. ఇప్పుడు అక్కడ యాంటీ మిసైల్ యూనిట్ ఏర్పాటుచేస్తే అదంతా దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నో థాడ్.. నో థాడ్ అంటూ వారంతా నిరసన నినాదాలు చేశారు. ఒక్క సియాంజులేకాకుండా దేశంలో ఎక్కడా అలాంటి విభాగాన్ని ప్రారంభించడానికి వీల్లేదంటూ వారు మండిపడ్డారు.

మరిన్ని వార్తలు