ఫైనల్లీ.. మార్స్‌ మాతో మాట్లాడుతోంది!

25 Apr, 2019 17:25 IST|Sakshi

అనంత విశ్వంలో మానవాళి మనుగడకు అనుకూలమైన ఏకైక గ్రహం భూమి మాత్రమేనని మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒకవేళ భూ గ్రహం అంతమయ్యే పరిస్థితులు తలెత్తితే.. మానవజాతి అంతం కావాల్సిందేనా?  భూమి కాకుండా మనుషులు నివసించేందుకు మరే ఇతర గ్రహం అనుకూలం కాదా? అనే ప్రశ్నలకు బదులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు.. అంగారకుడి(మార్స్‌) మీద ప్రయోగాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా పరిశోధన సంస్థ నాసా ఇన్‌సైట్‌ ల్యాండర్‌ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను మార్స్‌పైకి పంపింది. అయితే ఇప్పటిదాకా అరుణగ్రహ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, గాలి శబ్దాలను మాత్రమే ఇన్‌సైట్‌ రికార్డు చేసింది.

తాజాగా ఇన్‌సైట్‌లో రికార్డైన శబ్దాలు శాస్త్రవేత్తలకు అంతులేని ఆనందాన్ని ఇస్తున్నాయి. మార్స్‌ ఉపరితలం, అంతర్గత వాతావరణం, కంపనాలు(భూకంపం వంటిది), వాటి ద్వారా ఏర్పడే ధ్వనులను రికార్డు చేయడమే ప్రధాన లక్ష్యంగా అక్కడ దిగిన ఇన్‌సైట్‌ త్వరలోనే తన టార్గెట్‌ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్స్‌పై ఇన్నాళ్లు నిశ్చలంగా ఉన్న ఇన్‌సైట్‌ తొలిసారి కుదుపులకు లోనైందని, కంపనాలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసిందని జెట్‌ ప్రపల్షన్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి విమానం ఎగురుతున్నపుడు వచ్చే శబ్దాలను పోలి ఉన్నాయని తెలిపారు.

ఫైనల్లీ మార్స్‌ మాతో మాట్లాడుతోంది..
ఈ విషయం గురించి మార్స్‌ మిషన్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ బ్రూస్‌ బెనెర్డ్‌ మాట్లాడుతూ... ‘ మార్స్‌పై విజయవంతంగా ప్రయోగాలు చేయగలుతామా అనే సందేహాలు నేటితో కాస్త తీరాయి. అక్కడ కంపన తరంగాలు యాక్టివ్‌గా ఉన్నట్లు కనుగొన్నాం. అవును మార్స్‌ ఇప్పుడు మాతో మాట్లాడుతోంది. తొలిసారి కంపించింది. కంపన తీవ్రత 2 నుంచి 2.5 యూనిట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. భూమి కాకుండా తొలిసారి మరో గ్రహంపై సిస్మాలజీ గురించి అధ్యయనానికి ముందడుగు పడింది. అయితే ఇంకాస్త ఓపికగా ఎదురుచూడాలి. వాటిని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి కంపనాలు తరచుగా నమోదు అయినపుడే ఈ విషయంపై పూర్తి అవగాహన వస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్‌ 6న నాసా విడుదల చేసిన తాజా శబ్దాలు నిజంగా కంపనాలకు సంబంధించినవేనా అనే విషయంపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు