పన్ను ఎగవేత ఆరోపణలు : ఆ కుబేరుడి కలలు కల్లలేనా? 

28 May, 2020 13:02 IST|Sakshi

టోక్యో: జపాన్‌కు చెందిన అపర కుబేరుడు, ఫ్యాషన్ దిగ్గజం యుసాకు మేజావా(45) మరోసారి వార్తల్లో నిలిచారు. స్పేస్-ఎక్స్ సంస్థ తొలి అంతరిక్ష పర్యాటక యాత్రకు వెళ్లే మొట్టమొదటి వ్యక్తిగా నిలవనున్న యుసాకు ఇపుడు ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా ఆయన ఈ యాత్ర నుంచి తప్పుకునే అవకాశం ఉందని జపాన్ మీడియా నివేదించింది. సుమారు 4.6 మిలియన్ డాలర్ల  పన్నులను ఎగవేసినందుకు ఆయనపై దర్యాప్తు  జరుగుతోందని  కథనాలు ప్రచురించాయి. గత మూడు సంవత్సరాల కాలంగా తన ఆస్తి నిర్వహణా సంస్థ యాజమాన్యంలోని కార్పొరేట్ జెట్ వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించడంలో మేజావా విఫలమయ్యారని  పేర్కొన్నాయి.

ఆన్‌లైన్ రిటైలర్, జోజోటౌన్ వ్యవస్థాపకుడు యుసాకు మేజావా జపాన్ మీడియా నివేదికలపై ట్విటర్ ద్వారా స్పందించారు. మనశ్శాంతిగా జీవించగలిగే దేశంలో తాను నివసించాలని కోరుకుంటున్నాననీ, అలాగే తమ వ్యాపార రహస్యాలు వ్యక్తిగత మీడియాకు అధికారులు లీక్ చేయకుండా భద్రంగా ఉంచాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. అంతేకాదు ఎక్కడికీ పారిపోను, దాక్కోను,  తన పన్నులను ఎలా నిర్వహించాలో దయచేసి సెలవివ్వాలంటూ సెటైర్లు వేశారు. తన పేరును కూడా సరిగా రాయలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు జపాన్ జాతీయ పన్ను ఏజెన్సీ దీనిపై స్పందించడానికి నిరాకరించింది.

కాగా ఎలాన్‌ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో ఈ అంతరిక్షయాత్రను 2023లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే,1972 అనంతరం సాధారణ పౌరులు చంద్రుని మీదకు వెళ్లడం అదే మొదటిసారి అవుతుంది.  అలాగే గత ఏడాది తన ట్వీట్ ఒక దానిని షేర్ చేసిన  వెయ్యిమందికి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్‌లు పంచుతానని ప్రకటించారు. దీంతోపాటు  ఈ జాబిల్లి యాత్ర అనుభవాన్ని ఒక ''విశిష్ట'' మహిళతో పంచుకోవాలని తాను కోరుకుంటున్నట్లు యుసాకు ఆన్‌లైన్‌లో ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించడం విశేషంగా నిలిచింది.

చదవండి : నాకో ప్రేయసి కావాలి...జపాన్‌ కుబేరుడు
జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు