రేప్‌ బాధితురాలికి ఘోరమైన ప్రశ్నలు!

9 Mar, 2016 18:17 IST|Sakshi
రేప్‌ బాధితురాలికి ఘోరమైన ప్రశ్నలు!

- మహిళా జడ్జి అడిగిన ప్రశ్నలపై సర్వత్రా నిరసన

మాడ్రిడ్‌: ఓ రేప్‌ బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని వివరిస్తుండగా.. మహిళా జడ్జి ఆమెను అడుగకూడని ప్రశ్నలు అడిగింది. మానవత్వం తలదించుకునేలా రేప్ బాధితురాలిపై న్యాయమూర్తి ప్రశ్నలు సంధించింది. తనపై జరిగిన లైంగిక దాడి గురించి బాధితురాలు వివరిస్తుండగా.. న్యాయమూర్తి అడ్డుపడి 'నువ్వు ఆ సమయంలో కాళ్లు దగ్గరగా ముడుచుకున్నావా? నీ స్త్రీ అంగాలను ముడుచుకున్నావా' అంటూ అవమానకరరీతిలో ప్రశ్నించింది. ఈ ఘటన గత ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగింది. రేప్‌ బాధితురాలిని అవమానించేలా ప్రశ్నలు అడిగిన జడ్జి మారియా డెల్ కార్మెన్ మొలినాపై చర్యలు తీసుకోవాలంటూ స్పెయిన్‌లోని మహిళా హక్కులు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సదరు న్యాయమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ జాతీయ జ్యుడీషియల్ కౌన్సిల్‌ (సీజీపీజె)కు ఫిర్యాదు చేశాయి.

మహిళలపై నేరాల కేసును విచారించే ప్రత్యేక కోర్టులో ఈ విచారణ జరిగింది. ఉత్తర స్పెయిన్‌లోని విక్టోరియాకు చెందిన రేప్ బాధితురాలు ఐదు నెలల గర్భవతి. తన పార్ట్‌నర్‌ తనపై లైంగిక దాడులు జరుపడమే కాదు శారీరకంగా హింసిస్తున్నాడని, అతడి నుంచి విముక్తి కల్పించాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంలో మహిళా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలతో బాధితురాలు దిగ్భ్రాంతి చెందింది. ఇలాంటి ప్రశ్నలు న్యాయమూర్తి అడుగటం విచారణకు అనవసరమే కాకుండా బాధితురాలి గౌరవ, ఆత్మాభిమానాలకు భంగకరమని మహిళా హక్కుల సంఘం క్లారా కాంపొమర్ అసోసియేషన్ పేర్కొంది. జడ్జి అడిగిన ప్రశ్నలు అవమానకరం, అగౌరవకరం, మానవత్వానికి మచ్చ అని పేర్కొన్నారు. రేప్ బాధితురాలి వాంగ్మూలాన్ని విశ్వసించని న్యాయమూర్తి ఇలా అభ్యంతరకరమైన ప్రశ్నలతో తరచూ అడ్డుపడిందని, ఏ విచారణలోనైనా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని ఆ సంఘం స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు