టిక్‌టాక్ బ్యాన్‌పై వెనక్కి త‌గ్గిన అమెజాన్!

11 Jul, 2020 09:22 IST|Sakshi

వాషింగ్టన్‌: టిక్‌టాక్ యాప్‌ను త‌మ ఫోన్ల నుంచి తీసేయాల‌ని కోరుతూ ఉద్యోగుల‌కు మొయిల్ పంపిన అమెజాన్  సంస్థ కొన్ని గంటల్లోనే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంది. పొర‌పాటుగా ఈ- మొయిల్ పంపామ‌ని, టిక్‌టాక్ నిషేధంపై ప్ర‌స్తుతం త‌మ‌కు ఎలాంటి విధానాలు లేవ‌ని పేర్కొంది. టిక్‌టాక్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు సంబంధించి ఏం జ‌రిగిందనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి అమెజాన్ డాట్‌కామ్‌ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్ నిరాక‌రించారు. ఓ సీనియ‌ర్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ తెలిపిన దాని ప్ర‌కారం.. టిక్‌టాక్ యాప్‌ను తీసేయాల‌ని ఉద్యోగుల‌కు మొయిల్ పంపగా ఆ విష‌యం కాస్తా టిక్‌టాక్ ప్ర‌తినిధి వ‌ర‌కు చేరింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ఆయ‌న అమెజాన్ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్‌తో ప‌రస్పరం చ‌ర్చ‌లు జ‌రిపారు. దీంతో టిక్‌టాక్ నిషేధంపై అమెజాన్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. 

భార‌త్-చైనా స‌రిహ‌ద్దు వివాదం నేపథ్యంలో టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌ను భారత ప్రభుత్వం బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అగ్ర‌రాజ్యం అమెరికా సైతం టిక్‌టాక్ బ్యాన్ దిశ‌గా అడుగులు వేస్తోంది. తమ దేశంలో  టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సైతం ప్రకటించారు. అంతేకాకుండా రిపబ్లికన్ జాతీయ కమిటీ  టాక్‌టాక్ యాప్‌ను ఇక‌పై డౌన్‌లోడ్ చేయ‌వ‌ద్ద‌ని త‌మ స‌భ్యుల‌ను శుక్ర‌వారం ఈ- మెయిల్ ద్వారా కోరింది. సైబ‌ర్ ముప్పు ఉంద‌నే స‌మాచారంతో గ‌తేడాది నేవీ స‌భ్యులు టిక్‌టాక్‌ను ఉప‌యోగించ‌రాదని అమెరికా ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. (చైనా యాప్‌ల బ్యాన్‌ దిశగా అమెరికా?)

అమెరికాలో రోజురోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ టిక్‌టాక్‌ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులను టిక్‌టాక్‌ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్‌ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాజీ చీఫ్‌ అలెక్స్‌ జూ, లాస్‌ఏంజెలెస్‌ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్‌ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు. (చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్‌టాక్‌)

మరిన్ని వార్తలు