గాలి పందిరి... గమ్మత్తు లోగిలి...

21 Oct, 2016 06:46 IST|Sakshi
గాలి పందిరి... గమ్మత్తు లోగిలి...

ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందంటే ఒకటో రెండో షామియానాలు వేయించాలి కదా... కానీ అదేం అంత సులభం కాదు. టెంట్‌హౌస్‌కు చెప్తే వాళ్లు వెంటనే వచ్చేస్తారన్న గ్యారంటీ లేదు. గడియకోసారి ఫోన్ చేయాలి... వాళ్లు వచ్చి షామియానాలు వేయడానికి నానా అవస్థలు పడాలి. పైగా... గాలి కొడితే అవి కూలి పోకుండా హైరానా పడాలి. ఈ న్యూసెన్స్ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే పక్కనున్న ఫొటో చూడండి. ఇవి కూడా షామియానాలే. కాకపోతే గాలి షామియానాలు. అత్యంత పలుచనైన, దృఢమైన ప్లాస్టిక్‌తో తయారు చేశారు వీటిని. స్పెయిన్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ డోసిస్ వీటి రూపకర్త.

చిన్న చిన్న మోటార్లతో నిమిషాల వ్యవధిలో గాలి నింపితే ఫొటోల్లో ఉన్నట్టుగా తయారవుతాయి.  4300 చదరపు అడుగుల విశాలమైన, ఎనిమిది అడుగుల ఎత్తై ఫంక్షన్ హాల్‌గా మారిపోతాయి. మొత్తం ఒకే హాల్‌లా కాకుండా అక్కడక్కడా ప్రత్యేకమైన గదులు కూడా ఉండటం వీటిలోని విశేషం. ఈ మధ్యనే ఈ వినూత్న షామియానాను లండన్‌లోని ఓ విశాలమైన పార్క్‌లో ‘షఫల్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వినియోగించారు. చిన్న స్క్రీన్లపై సినిమాలు ప్రదర్శించడంతోపాటు కొన్ని వర్క్‌షాప్‌లు, సైన్స్ ప్రయోగాలు కూడా నిర్వహించారు.  పైకప్పు ఉండటం వల్ల వానొస్తుందన్న భయం లేదు. గాలి వేగం ఎక్కువైతే అందుకు తగ్గట్టుగా ఈ షామియానా తన షేపును మార్చుకుంటుంటే తప్ప కూలిపోయి రభస సృష్టించదు. బాగుంది కదూ ఈ గాలి షామియానా... టెక్నాలజీ నజరానా.


 

మరిన్ని వార్తలు