కదలికే.. వెలుగు

30 Jun, 2014 02:33 IST|Sakshi
కదలికే.. వెలుగు

ఒక చిన్న ఆలోచన గొప్ప మలుపునకు కారణమవుతుంది. చిన్న పిల్లల ఆట నుంచి, సంగీత పరికరం నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ఓ చిన్న పరికరం ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది. కేవలం కాసేపు అటూ ఇటూ కదిలిస్తే చాలు.. చార్జింగ్ అయ్యి వెలుగునిచ్చే ఆ పరికరమే.. ‘స్పార్క్’. సుధా ఖేతర్‌పాల్ అనే ప్రవాస భారతీయ సంగీత విద్వాంసురాలు దీనికి రూపకల్పన చేశారు. కేవలం 12 నిమిషాల పాటు అటూ ఇటూ ఊపితే చార్జింగ్ అయి.. దాదాపు గంట పాటు వెలుగునిస్తుంది. అంతేకాదు దీనితో సెల్‌ఫోన్లు వంటి పరికరాలను కూడా చార్జ్ చేసుకోవచ్చు. కెన్యాలోని విద్యుత్ సరఫరాలేని ప్రాంతాల్లో విద్యార్థులకు ఈ ‘స్పార్క్’ను ఇచ్చి పరిశీలించారు కూడా. అక్టోబర్ నుంచి దీనిని విక్రయించనున్నారు.

ఈ పరికరాలను భారీ సంఖ్యలో తయారుచేసేందుకు అవసరమైన నిధుల కోసం సుధ ఈ ప్రాజెక్టును క్లౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ కిక్‌స్టార్టర్‌లో పెట్టారు. గుండె ఆకారంలో ఉండే ఈ పరికరంలో లోహపు గుండ్లను పెట్టడం ద్వారా ఊపినప్పుడు ధ్వని వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో పిల్లల ఆటా అవుతుంది.. ‘స్పార్క్’ చార్జింగూ అవుతుంది. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇదిఎంతో తోడ్పడుతుందని సుధ చెబుతున్నారు.

 ఎలా పనిచేస్తుంది: కదులుతున్న అయస్కాంత క్షేత్రం విద్యుదావేశాన్ని పుట్టించగలదన్న ఒక సాధారణ భౌతిక శాస్త్ర సూత్రం ఆధారంగా ఈ ‘స్పార్క్’ పనిచేస్తుంది. దీనిలోపల ఒక రాగి చుట్టను దాని మధ్యగా కదిలే అయస్కాంతాన్ని అమర్చారు. వీటికి సర్క్యూట్ బోర్డును, బ్యాటరీని, డయోడ్లను అనుసంధానించారు. దీనిలో అయస్కాంతం అటూ ఇటూ కదిలిన కొద్దీ విద్యుత్ ఉత్పత్తయి బ్యాటరీలో నిల్వ అవుతుంది.
 

మరిన్ని వార్తలు