3రోజుల తర్వాత మళ్లీ ప్రధానిగా!

28 Oct, 2018 19:15 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. రణిల్‌ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ.. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్‌ స్పీకర్‌ కరు జయసూరియ వ్యతిరేకించారు. చట్టపరంగా విక్రమసింఘే ప్రధాని అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వివాదంపై సిరిసేనకు ఓ లేఖ రాశారు. పార్లమెంట్‌ను నవంబర్‌ 16 వరకు మూసివేయడం మరింత రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వేరే వ్యక్తి పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకునేంతవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. 

కాగా, శుక్రవారం రోజున విక్రమసింఘేను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సిరిసేన, దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు. అంతేకాకుండా విక్రమసింఘేకు భద్రత ఉపసంహరిస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దీంతో మూడు వారాల పాటు పార్లమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు సిరిసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.

హింసాత్మకంగా మారుతున్న వైనం
శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆదివారం హింసాత్మకంగా మారింది. ఎంపీ అర్జున రణతుంగా  సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పులో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు.  విక్రమసింఘే క్యాబినేట్‌లో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన రణతుంగా.. సిరిసేన శనివారం క్యాబినేట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పదవిని కొల్పోయారు. అయితే ఆదివారం రోజున ఆయన తన ఆఫీసులోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న సముహంపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: శ్రీలంక పార్లమెంటు రద్దు

మరిన్ని వార్తలు