నిక్కీ అడుగులు ఎటువైపు ?

11 Oct, 2018 09:30 IST|Sakshi

ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి, భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ ఆకస్మికంగా రాజీనామా చేయడం పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు నెలరోజుల  ముందు ఆమె రాజీనామా చేయడం ట్రంప్‌ సర్కార్‌కి దెబ్బేనన్న భావన వ్యక్తమవుతోంది. రాజీనామా అనంతరం ప్రెస్‌ మీట్‌లో నిక్కీ హేలీ ట్రంప్‌ను పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకే తాను మద్దతు పలుకుతానని స్పష్టం చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నిక్కీ హేలీ పోటీపడతారన్న ఊహాగానాలకు ఆమె తెరదించుతూ తాను ట్రంప్‌ తరఫున ప్రచారం చేస్తానని మాత్రమే ఆమె వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ పడినా, లేకపోయినా ట్రంప్‌కు రాజకీయంగా ముప్పుగా మారుతారన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. 

రాజకీయ అడుగులు ఎటు ? 
నిక్కీ హేలీ అమెరికా రాజకీయాల్లో తనకంటూ సొంతంగా ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. భారత వలసదారుల కుటుంబంలో పుట్టి, మైనార్టీగా ఉన్నప్పటికీ 2010లో దక్షిణ కేరొలినాకు తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అతి పిన్న వయసులోనే గవర్నర్‌ పదవిని చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు. 2014లో తిరిగి గవర్నర్‌ పదవి చేపట్టారు. ట్రంప్‌ ప్రభుత్వంలో చేరేవరకు గవర్నర్‌గానే ఉన్నారు. అమెరికా రాయబారిగా ఆమె అనుసరించిన విదేశీ విధానం విమర్శకుల ప్రశసంల్ని సైతం పొందింది . ట్రంప్‌ ప్రభుత్వంలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వైట్‌హౌస్‌తో వ్యవహారాల్లో విచక్షణ చూపిస్తూ, అమెరికా విదేశాంగ విధానానికి ఒక గుర్తింపు తెచ్చిన మహిళగా పేరు సంపాదించారు.‘‘రిపబ్లికన్‌ పార్టీలో నిక్కీ హేలీ ఒక రైజింగ్‌ స్టార్‌. అలాంటివారు ఎప్పటికైనా ట్రంప్‌కి ముప్పుగానే మారతారు’’ అని రిపబ్లికన్‌ పార్టీ వ్యూహకర్త మైక్‌ ముర్ఫీ అభిప్రాయపడ్డారు.

రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థుల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన క్రిస్టిన్‌మాథ్యూస్‌ కూడా హేలీ తన సొంత ప్రయోజనాల కోసమే రాయబారి పదవికి రాజీనామా చేసినట్టు అంచనా వేశారు. ‘‘హేలీ అద్భుతమైన పనితీరుని కనబరిచారు. ఆమెకున్న పేరుప్రతిష్టలను పెంచుకున్నారు. ట్రంప్‌ పాలనాయంత్రాంగంలో హేలీలాంటి వ్యక్తి మరొకరు కనిపించరు. భవిష్యత్‌ రాజకీయ కోసమే ఆమె పదవి నుంచి తప్పుకున్నారు’’అని మాథ్యూస్‌ వ్యాఖ్యానించారు.. డెమొక్రాట్లు కూడా హేలీ పనితీరుని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా ఆమె అడుగులు ఎటు వైపు వేస్తారన్న చర్చ డెమొక్రాటిక్‌ పార్టీలోకూడా సాగుతోంది. ట్రంప్‌తో ఢీ కొనాలంటే 2020లో అధ్యక్ష బరిలోకి దిగాలని, 2024 వరకు వేచి చూస్తే ఇప్పుడున్న పేరుని హేలీ కాపాడుకోవడం కష్టమన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. 

గత ఎన్నికల్లో ట్రంప్‌తో ఢీ అంటే ఢీ
గత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిక్కీ హేలీ ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. ఫ్లోరిడా సెనేటర్‌ మార్కో రూబియోకు మద్దతుగా నిలవడమే కాదు, ట్రంప్‌ను తరచూ విమర్శించే వారు. ఆయన మాటల్ని తిప్పికొడుతూ ఉండేవారు. అయినప్పటికీ హేలీ సొంత రాష్ట్రంలోని ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక  లైంగిక ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఆమె బాధితుల పక్షానే మాట్లాడారు. ట్రంప్‌ ప్రభుత్వంలో చేరిన తర్వాత కూడా హేలీ ట్రంప్‌కు వ్యతిరేకమనే ఆరోపణలు కూడా వచ్చాయి. ట్రంప్‌ వ్యవహారశైలిపై ఆరోపణలు గుప్పిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో పేరు లేకుండా ప్రచురితమైన∙వ్యాసం నిక్కీ హేలీ రాసినదేనన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె దానిని ఖండిస్తూ అధ్యక్షుడిని సవాల్‌చేయాల్సి వస్తే నేరుగానే చేస్తానని చెప్పుకున్నారు. ఇలా మొదట్నుంచి ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్న హేలీ భవిష్యత్‌లో కూడా రాజకీయంగా ఢీ కొడతారన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. 

అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా

మరిన్ని వార్తలు