సిరియా పాపం ఎవరిది?

8 Apr, 2017 01:58 IST|Sakshi

వేల ఏళ్ల సిరియా చరిత్ర మొత్తం పరాయి దేశాలు, రాజుల పాలనలోనే గడిచిపోయింది. ఇక ఆధునిక సిరియా హఫెజ్‌ అల్‌ అసద్, అతని కొడుకు బషర్‌ అల్‌ అసద్‌ల నియంతృత్వ పాలనలో మగ్గిపోయింది. బషర్‌ నియంతృత్వానికి వ్యతిరేకంగా 2011లో మొదలైన అంతర్యుద్ధంతో సిరియా నాశనమైంది. ఐసిస్‌ ఉగ్రవాదుల ఆగడాలతో దేశంలోని సగం మంది చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు.

ఎందుకీ అంతర్యుద్ధం?
2010 చివర్లో ఈజిప్ట్‌ సహా అరబ్‌ దేశాల్లో నియంతల పాలనపై అరబ్‌ స్ప్రింగ్‌ పేరిట ప్రారంభమైన తిరుగుబాట్లతో సిరియన్లు కూడా ఉత్తేజితులయ్యారు. అసద్‌ కుటుంబ అవినీతి, అణచివేతతో విసిగిపోయిన ప్రజలు 2011 మార్చిలో దేరా పట్టణంలో తిరుగుబాటు చేశారు. అక్కడ మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. దేరాలో ప్రజాప్రదర్శనను అసద్‌ సర్కారు అణచివేయడంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్‌ వ్యతిరేకులు మద్దతు అందించారు.

అసద్‌ షియా కావడంతో షియా మెజార్టీ దేశం ఇరాన్ తోపాటు, సొంత ప్రయోజనాల మేరకు రష్యాలు సాయం చేస్తున్నాయి. ఇక రష్యా అంటే గిట్టని అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు సాయం అందిస్తున్నాయి. ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్‌ కుటుంబం అప్పటి సోవియెట్‌ యూనియన్ కు మద్దతుగా నిలిచింది.

దీంతో సోవియెట్‌ యూనియన్  విచ్ఛిన్నమయ్యాక అమెరికా అసద్‌ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తుంది. ఫలితంగా రష్యాకు అసద్‌ సర్కారు మరింత చేరువైంది. సిరియా వేదికగా అమెరికా, రష్యాలు ప్రత్యక్షంగా తలపడడం ఈ అంతర్యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. ఒక్క అలెప్పోలోనే  దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో 2015 ఆగస్టు నుంచి మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దాదాపు అర కోటి మంది  పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు