ఆ వీసాలను ట్రంప్‌ సర్కారు రద్దు చేయనుందా?

11 Apr, 2017 11:06 IST|Sakshi
ఆ వీసాలను ట్రంప్‌ సర్కారు రద్దు చేయనుందా?

హెచ్‌–4 వీసాల రద్దు దిశగా ట్రంప్‌ సర్కారు పావులు!
వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్‌ వీసాల్ని(స్పౌజ్‌ వీసా) ట్రంప్‌ సర్కారు రద్దు చేయనుందా? అమెరికా ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్‌ వీసాలు జారీ చేయాలని 2015లో  అమెరికా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 2 లక్షల మంది ‘జీవిత భాగస్వామి వీసా’(హెచ్‌–4)లపై అమెరికాలో నివసిస్తున్నారు.

వారిలో అధిక శాతం వివిధ ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సర్కారు నిర్ణయాన్ని 2015లోనే కాలిఫోర్నియాకు చెందిన కొందరు ఐటీ ఉద్యోగులు కింది కోర్టులో దావా వేశారు.  కేసును 2016లో కింది కోర్టు కొట్టివేసింది. తీర్పును పైకోర్టులో సవాలు చేశారు. ఇంతలో ట్రంప్‌ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ కేసులో సమాధానం చెప్పేందుకు తమకు 60 రోజులు గడువు కావాలని కోర్టును కోరింది.

ఆ గడువు సోమవారంతో ముగియడంతో... విచారణను మరో ఆరు నెలలు ఆపాలంటూ వాషింగ్టన్‌ డీసీ సర్క్యూట్‌ అప్పీలు కోర్టును ట్రంప్‌ సర్కారు కోరింది. 2015 నుంచిహెచ్‌–4 పేరిట జీవిత భాగస్వాములకు వర్క్‌ వీసాల జారీని ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికాలో వీరి సంఖ్య 2 లక్షలుగా ఉంది. వీరిలో చాలా మందికి హెచ్‌ –1బీ వీసా వచ్చే అవకాశమున్నా... ‘జీవిత భాగస్వామి వీసా’ కోసం దానిని వదులుకున్నారు.

దాదాపు 2 లక్షల మంది యువతులు జీవిత భాగస్వామి వీసాలపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధికశాతం మంది అక్కడే స్థిరపడ్డారు. ఐతే విదేశీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు హెచ్‌-4 వీసాలను రద్దు చేయడంపై దృష్టి సారించిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు