ఇరాన్ లో ట్యాపింగ్ కలకలం!

13 Jun, 2015 18:18 IST|Sakshi

టెహ్రాన్: ఇరాన్లో కూడా ట్యాపింగ్ కలకలాన్ని సృష్టిస్తోంది. అక్కడ ఉన్నతాధికారుల వద్ద ఉండే సమాచారాన్ని గూఢచారులు తస్కరించే ప్రమాదం ఉందన్న అనుమానంతో.. అక్కడి ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పని ప్రదేశాల్లో ఇలాంటి ఉన్నతాధికారులు ఎవరూ స్మార్ట్ ఫోన్లు వాడకుండా ఉండేలా నిషేధం విధించాలన్న యోచనలో అక్కడి సర్కారు కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లనయితే సులభంగా ట్యాప్ చేయొచ్చని, వాటిలో ఉన్న సమాచారాన్ని హ్యాక్ చేయొచ్చని ఇరాన్ సర్కారు భావిస్తోంది. ఒకవేళ గూఢచారులు అధికారుల ఫోన్లలో సమాచారాన్ని తస్కరించడంతో పాటు.. వాటిని పూర్తిగా తొలగిస్తే, అధికారులు ఆ సమాచారాన్ని తిరిగి పొందడం కూడా అంత సులువైన పని కాదని బ్రిగేడియర్ జనరల్ జలాలీ తెలిపారు.

 

కీలక సమాచారం బయటకి పోకుండా ఉండాలంటే పని చేసే ప్రదేశాల్లో బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతించేలా కొత్త నిబంధనలు రూపొందించామన్నారు. ఈ కీలక నిర్ణయాలు అమలుకు తుది దశలో ఉన్నట్లు తెలిపారు. కీలకమైన న్యూక్లియర్ ఒప్పందాలు కుదుర్చుకుందామనుకున్న సమయంలో గూఢచార్యంపై వస్తున్న వార్తలతో ఇరాన్ ఈ ఆంక్షలు విధించాలనుకోంటోంది.

మరిన్ని వార్తలు